పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వ్యతిరేకిస్తూ 19న విజయవాడలో నిరసన

  • 20 నుండి అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు
  • వామపక్ష నేతల ప్రకటన

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ఈనెల 19వ తేదీన విజయవాడలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వామపక్ష పార్టీల నాయకులు ప్రకటించారు. శుక్రవారం విజయవాడ గాంధీనగర్లోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, న్యూడెమెక్రసీ నాయకులు పి.ప్రసాదు, ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఖాదర్‌భాషా తదిరులు మాట్లాడుతూ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని అన్నారు. వాటిని రద్దుచేసే వరకూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలిపారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెండాను భుజాన వేసుకున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యల పైనా వారు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే సర్దుబాటు ఛార్జీల భారం రూ.6,072 కోట్లు మోపి ఇప్పుడు కొత్తగా రూ.11 వేల కోట్లు వేయాలనుకోవడం దుర్మార్గమని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంతటి భారం ఎన్నడూ వేయలేదని అన్నారు. పెంచిన ఛార్జీలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. ఛార్జీల పెంపుపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈనెల 19వ తేదీ వరకూ విద్యుత్‌ నియంత్రణ మండలి అవకాశం కల్పించిందని, ప్రజలు ప్రజాసంఘాలు, ప్రతిపక్షపార్టీలు తమ అభిప్రాయాలను విద్యుత్‌ నియంత్రణ మండలికి తెలపాలని కోరారు. వచ్చిన అభ్యంతరాలపై తమ వాదనలు వినిపించేందుకు ఎపిఇఆర్‌సి అవకాశం కల్పించాలనీ కోరారు. మాజీ సిఎం నిర్వాకం వల్ల భారాలు పెంచాల్సి వచ్చిందని చెప్పడం సరైన పద్ధతి కాదని, దీనిపై మంత్రులు కథనాలు రాయడం కూడా సరికాదని పేర్కొన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు చెప్పిన విసయాన్ని గుర్తు చేశారు. పవన్‌కల్యాణ్‌ సనాతన ధర్మం పేరుతో చేస్తున్న ప్రచారాన్ని మానుకోవాలని అన్నారు. జనసేనని బిజెపిలో కలపాలని అమిత్‌షా కోరిన సందర్భంలో పవన్‌ అంగీకరించకపోవడంతోనే జనసేనను లౌకికపార్టీగా గుర్తించారని, ఆ విషయాన్నిమర్చిపోకూడదని అన్నారు. బిజెపి ఎమ్మెల్యేలుగా ఉన్న సత్యకుమార్‌ తదితరులే సనాతన ధర్మం గురించి మాట్లాడటం లేదని తెలిపారు. విద్యుత్‌ ఛార్జీల పెంపువల్ల వినియోగదారులపై ఒక్కో యూనిట్‌కు రూ.1.80 పైసల నుండి రూ.2.40 పైసల వరకూ అదనపుభారం పడుతుందని తెలిపారు. గతంలో స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు వద్దన్న చంద్రబాబు ఇప్పుడు కొనసాగిస్తున్నారని విమర్శించారు. వాటిని కూడా షిర్టిసాయి కంపెనీకి కట్టబెడుతున్నారని, మద్యం, ఇసుక, పెరిగిన ధరలతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. వీటిపై ప్రజల వాణిని వినిపించేందుకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో 19వ తేదీన నిరసన తెలపనున్నట్లు పేర్కొన్నారు. 20వ తేదీ నుండి వామపక్ష నాయకులు మూడు దళాలుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. దీనికి ప్రజలు మద్దతు తెలిపి జయప్రదం చేయాలని కోరారు. సనాతన ధర్మం పేరుతో పవన్‌ చేస్తున్న వ్యాఖ్యలు లౌకికతత్వానికి నష్టమని, రాష్ట్రంలో మత సామరస్యాన్ని పెంపొందించే దిశగా చర్యలు ఉండాలని అన్నారు. జనసేన కార్యకర్తలు దీనిపై ఆలోచించి మత రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు జెల్లి విల్సన్‌, న్యూడెమెక్రసీ నాయకులు పొలారి తదితరులు పాల్గొన్నారు.

➡️