ప్రధాని పర్యటనకు నిరసన సెగ

  • వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ తగదని, బల్క్‌ డ్రగ్‌ పార్కు వద్ద ఆందోళనలు
  • పిఎం బహిరంగ సభ సమీప ప్రాంతంలో హోరెత్తిన ‘మోడీ గో బ్యాక్‌’ నినాదాలు
  • ఆందోళనకారుల అరెస్టు
  • రాజయ్యపేటలో ఉద్రిక్తత

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ విలేకరి(విశాఖ), అనకాపల్లి ప్రతినిధి :  : ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు నిరసన సెగ తగిలింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను నిలిపివేసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని, విశాఖ వేదికగానే ప్రధాని నిర్ధిష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీల నాయకులు ప్రధాని బహిరంగ సభ సమీప ప్రాంతమైన మద్దిలపాలెం వద్ద మెరుపు నిరసనకు దిగారు. పోలీసుల రాకతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మద్దిలపాలెం సమీపంలోని కిన్నెర, కామేశ్వరి థియేటర్‌ సమీప ప్రాంతం నుంచి మద్దిలపాలెం కూడలి వరకు పోలీసు వలయాన్ని ఛేదించు కుంటూ సిపిఎం, సిపిఐ నాయకులు దూసుకెళ్లారు. మోడీ గో బ్యాక్‌ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బ్యానర్‌లు, నల్ల జెండాలు పట్టుకుని ఆందోళన కారులు తమ నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేసి విశాఖ మూడో పట్టణ, ఎంవిపి.కాలనీ, నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ.. మోడీకి దాసోహమై విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు టిడిపి కూటమి ప్రభుత్వం తీవ్ర ద్రోహం తలపెట్టిందని విమర్శించారు. తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళన కారులపై విరుచుకుపడ్డారు. ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వాహనాలు ఎక్కించారు. అరెస్టయిన వారిలో సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం. పైడిరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, బి.జగన్‌, పి.మణి, వి.కృష్ణారావు, నాయకులు బొట్టా ఈశ్వరమ్మ, సిపిఐ నాయకులు ఎ.విమల, కె.సత్యనారాయణ సహా 120 మంది ఉన్నారు. కాంగ్రెస్‌ నాయకులు దండి ప్రియాంక, మమతా నాగిరెడ్డి, లక్కరాజు రామా రావు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగగా వారినీ పోలీసులు అరెస్టు చేశారు.

బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ పై వెల్లువెత్తిన నిరసన

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గమైన పాయకరావుపేట పరిధి నక్కపల్లి మండలం రాజయ్యపేటలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బల్క్‌ డ్రగ్‌ పార్కును వ్యతిరేకిస్తూ పాటిమీద, మూలపర్ర, తమ్మయ్యపేట నిర్వాసితులు నిరసన తెలిపారు. బల్క్‌డ్రగ్‌ పార్క్‌ను రద్దు చేయాలని రాజయ్యపేటలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. అక్కడ వారితో కలిసి నిరసన తెలుపుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.శంకరరావు, నక్కపల్లి మండల కార్యదర్శి రాజేష్‌, జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణలను పోలీసులు బలవంతంగా వాహనం ఎక్కించి నిరసనకారులను చెదరగొట్టడానికి చేసిన ప్రయత్నా లను ప్రతిఘటించారు. పోలీసు వాహనాన్ని మహిళలు అడుగడుగునా అడ్డుకోవడంతో అరెస్టు చేసిన వారిని ద్విచక్రవాహనాల్లో పలు స్టేషన్లకు పోలీసులు తరలించారు. రాజయ్యపేట వద్ద ఏర్పాటు చేసిన మోడీ వర్చువల్‌ సభలో నిరసనలు తెలపకుండా నాలుగు వైపులా పోలీసులు నిఘాపెట్టారు. నక్కపల్లి జడ్‌పిటిసి గోసల కాసులమ్మను రాజయ్యపేటలో ఆమె గృహంలో నిర్బంధం చేశారు. వైసిపి సీనియర్‌ నాయకులు వీసం రామకృష్ణ, చందనాడ ఎంపిటిసి సభ్యులు గంటా తిరుపతిరావు, వైసిపి నాయకులు తళ్ల భార్గవ్‌, సూరకాసుల గోవింద్‌లను నక్కపల్లి, పాయకరావుపేట పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

➡️