4న స్పష్టత ఇవ్వకుంటే ప్రధాని పర్యటనలో నిరసన

  • విశాఖ ఉక్కుపై కె.రామకృష్ణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ నెల 4న సిఎం ఢిల్లీలో జరపనున్న పపర్యటనలో ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన రాకపోతే, 8న ప్రధాని మోడీ నిర్వహించనున్న రాష్ట్ర పర్యటనలో నల్లజెండాలతో నిరసన తెలుపుతాయని ఆయన చెప్పారు. విజయవాడలోని దాసరి భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాకుండా చూడాల్సిన బాధ్యత నాటి ముఖ్యమంత్రి జగన్‌దేనంటూ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్‌ ప్రస్తావనే తేవడం లేదని, మరోవైపు మిట్టల్‌ స్టీల్‌ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. సెకీ విద్యుత్‌ ఒప్పందాల్లో జరిగిన అవినీతిపై అమెరికా ప్రభుత్వనివేదిక కోసం ఎదురు చూస్తున్నామంటూ సిఎం చేసిన ప్రకటన విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలపై భారీ భారం పడుతున్నా సిఎం వ్యాఖ్యలు దురదుష్టకరమన్నారు. కృష్ణా – గోదావరి – పెన్నా నదుల అనుసంధానం కోసం రూ.80 వేల కోట్లు ఖర్చ అవుతుందని, దీన్ని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడతామని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. సాగునీటి రంగంలో ఈ తరహా నిర్ణయం అత్యంత ప్రమాదకరమైన ఆలోచన అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.దుర్గాభవానీ, ఆ పార్టీ నాయకులు కోటేశ్వరరావు, జాన్సన్‌బాబు పాల్గొన్నారు.

➡️