అడ్డుకున్న దళితులు
ప్రజాశక్తి-చిత్తూరు: తరతరాలుగా ఉన్న స్మశాన స్థలాన్ని కబ్జా చేసి శవాన్ని కూడా కూర్చునివ్వకుండా అడ్డుకోవడంతో చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని గంగాసాగరం, విజయనగరం దళితవాడ దళితులు ఆగ్రహంతో అప్పటికప్పుడే గుంత తవ్వి ఖననం చేయడంతో కబ్జాదారులకు దళితులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాల మేరకు గంగాసాగరం విజయనగరానికి చెందిన దళితులు తరతరాలుగా సమీపంలోని ఖాళీ స్థలంలో స్మశాన వాటిక ఏర్పాటు చేసుకొని అక్కడే చనిపోయిన వారిని పూడ్చేవారు. స్మశాన వాటిక ఆనుకొని ఉన్న స్థల యజమాని సైమన్ స్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించుకొని చనిపోయిన వారిని ఖననం చేయకుండా అడ్డుకుంటున్నాడు. శనివారం చిన్నయ్య అనే దళిత వృద్ధుడు మృతి చెందాడు. దళిత గ్రామస్తులు శవాన్ని తీసుకొని స్మశానానికి వెళ్తే ఇక్కడ పోర్చరాదు అంటూ అడ్డుకోవడంతో దళిత యువకులు మహిళలు, ఘర్షణకు దిగి తాము తరతరాలుగా ఇక్కడే ఖననం చేస్తున్నామంటూ గుంత తవ్వి పూడ్చారు. రెవెన్యూ అధికారులు పోలీసులు కబ్జాకు గురైన స్థలం స్మశాన వాటికే అంటూ నిర్ధారించారు.
