చొల్లంగిలో ఎమ్మెల్యేకు నిరసన సెగ

Mar 23,2024 14:39 #Kakinada, #MLA

ప్రజాశక్తి-తాళ్లరేవు(కాకినాడ) : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తాళ్ళరేవు మండలం చొల్లంగి వచ్చిన ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌ కు ప్రారంభంలోనే నిరసన సెగ తగిలింది. చొల్లంగి సాల్ట్‌ భూములు స్థానికులకే ఇవ్వాలని 46 రోజులుగా దీక్షలు చేసిన ఒక్కరోజు కూడా దీక్ష శిబిరానికి రాని మీరు ఇప్పుడు ఎన్నికల వేళ ఎలా వచ్చారని స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడారు. చొల్లంగి గ్రామ పెద్దలు తన వద్దకు వచ్చినప్పుడు సమస్య పరిష్కారం చేస్తానని చెప్పానని అన్నారు. న్యాయం చేయడానికి మీ మనిషిగా నేనుండగా ధర్నాలు, దీక్షలు ఎందుకు చేయాల్సి వచ్చిందని ఎమ్మెల్యే ప్రజలను అడిగారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు కట్ట త్రిమూర్తులు, గర్రె లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేతో మాట్లాడారు. స్థానిక సర్పంచ్‌, వైసిపి కార్యకర్తలకు సమస్య తీవ్రత తెలియజేసిన ఎవరూ పట్టించుకోలేదన్నారు. చొల్లంగి భూములు స్థానికులకు ఇవ్వాలని, దీనిపై సమాధానం చెప్పాలన్నారు. ఈ సమస్య జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెల్లామని, ప్రాసెస్‌లో ఉందని చెప్పి ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ అక్కడి నుంచి తప్పించుకున్నారు. అనంతరం చొల్లంగి పంచాయతీ వద్ద స్థానిక మహిళలు మీడియాతో మాట్లాడారు. గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయన్నారు. చొల్లంగి భూములు స్థానికులకే ఇవ్వాలని తెలిపారు. రక్షిత త్రాగునీటి పథకంలో వస్తున్న తాగునీరు మురికిగా మారిపోయి తాగడానికి అనుకూలంగా లేదని, ప్రజా ప్రతినిధులు, అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️