ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వం 48 గంటల్లోనే మిల్లులకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. ధాన్యం సేకరణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిసెంబరు 2, 3 తేదీల్లో స్థానికంగా నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చింది. ఈ అంశంపై సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, సహాయ కార్యదర్శి పి రంగారావుతో కలిసి విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల తీరు అస్తవ్యస్తంగా ఉందన్నారు. తేమ శాతాన్ని బట్టి ధాన్యానికి ధరను ఆర్‌బికె వద్ద నిర్ణయిస్తామని ప్రభుత్వం చెబుతున్నా, అదీ అమలు జరగడం లేదన్నారు. రైతును మిల్లు వద్దకు పంపిస్తున్నారని, మిల్లర్ చెప్పిన ధరకే రైతులను ఒప్పించిన అనంతరమే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో తేమ తక్కువగా ఉన్నా.. ఎక్కువగా ఉన్నట్లు మిల్లర్లు చెప్పి రైతులకు ధర తగ్గించి మోసం చేస్తున్నట్లు చెప్పారు. మిల్లుకు టార్గెట్‌ను బట్టి రోజుకు 2 నుంచి 6 లారీల ధాన్యాన్ని మాత్రమే తరలిస్తున్నారని, ఫలితంగా కల్లాల్లో ధాన్యం ఎక్కడివక్కడే ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం సేకరణ వాట్సాప్ నెంబరుకు మెసేజ్ పెట్టినా ధాన్యం కొనుగోలుకు వారం రోజుల వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. కృష్ణా జిల్లా అవిరిపూడి గ్రామంలో ఒక రైతు వాట్సాప్‌కు ఈ నెల 20న మెసేజ్ పెడితే 26న ధాన్యం కాటా వేశారని, నేటికీ ఆ ధాన్యాన్ని తరలించలేదని తెలిపారు. తేమలో వ్యత్యాసాన్ని బట్టి ఆ ధాన్యానికి రూ.1,661 రావాల్సి ఉండగా, ఆర్‌బికెలో రూ.1,649గా నిర్ధారించారని, అనంతరం మిల్లర్లు రూ.1,550కే కొంటానంటున్నారని రైతు తమ దృష్టికి తెచ్చారన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం లేదన్నారు. ప్రస్తుతం తుపాను ప్రభావం నెలకొనడంతో రైతులను వ్యాపారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారని, క్వింటాకు రూ.200 నుంచి రూ.300 తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. తేమ శాతాన్ని 25 వరకూ సడలించాలని, గ్రామాల నుంచి ధాన్యం తరలించే వాహనాల సంఖ్యకు పరిమితిని తొలగించాలని కోరారు. కేరళ, ఛత్తీస్‌గఢ్‌లో ఇస్తున్నట్లుగా క్వింటాకు కనీసం రూ.500 బోనస్ ప్రకటించాలన్నారు. అన్ని మిల్లులు డ్రైయర్ మిల్లులుగా మార్చడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో రైతులు పంటలు ఆరబోట్టుకోవడానికి వీలుగా స్థలాలు సేకరించాలని, కౌలు రైతులకు, నిజమైన సాగుదారులకు సబ్సిడీపై టార్పాలిన్లు అందజేయాలని డిమాండ్ చేశారు.