- అనకాపల్లి వాసుల మొర
- కొనసాగుతున్న ప్రజా చైతన్య యాత్రలు
ప్రజాశక్తి-యంత్రాంగం : ‘అదాని గంగవరం పోర్టు కాలుష్యం నుంచి తమకు రక్షణ కల్పించాలి, ఆనందపురంలో భీమిలి, దొరతోట రోడ్డు విస్తరణను 200 అడుగుల నుంచి వంద అడుగులకు తగ్గించాలి, తాగునీరు, డ్రెయినేజీ, విద్యుత్ ఛార్జీలు, తదితర సమస్యలను పరిష్కరించాలి’ అంటూ సిపిఎం నాయకుల వద్ద స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలు గురువారం పలుచోట్ల సాగాయి. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం చిన్న కలవలపల్లి, కొత్తపేట, జెడ్ చింతవ గ్రామాల్లో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం పాల్గొన్నారు.
చిన్న కలవలపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి కొండపోరంబోకు భూముల్లో జీడి మామిడి, కొబ్బరి, యూకలిప్టస్ వంటి తోటలు సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు వంటి జీవాలను పెంచుకొని బతికే వాళ్ళమని, తాటి, ఈత చెట్లకు కల్లు గీస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, కొండల చుట్టూ నేవీ అధికారులు ప్రహరీ నిర్మించడంతో తమ జీవనాధారం పూర్తిగా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ.. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, సంబంధిత ఫారెస్ట్ అధికారులు స్పందించి చిన్న కలవలపల్లి గ్రామస్తులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే నేవీ ప్రభావిత రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అల్లూరి జిల్లాలోని కొయ్యూరు మండలం చింతలపూడి, గింజర్తి, లుబుర్తి మాకవరం గ్రామాల్లో సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స జీడి మామిడి రైతులతో మాట్లాడారు. జీడీ మామిడి, కొండ పోడు పట్టాలు వంటి సమస్యలను రైతులు అప్పలనర్స వద్ద ప్రస్తావించారు. ముచంగిపుట్టు మండలంలోని జరెల పంచాయతీ బొడ్డగొంది, మంచంరాయి, మండిభ గ్రామాల్లో సిపిఎం నాయకులు ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ జిల్లా గాజువాక, మధురవాడ, ఆనందపురం ప్రాంతాల్లో సిపిఎం ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. గాజువాక భానోజీతోట, వాంబేకాలనీల్లో సిపిఎం జిల్లా కార్యదిర్శ ఎం.జగ్గునాయుడు బృందానికి స్థానికులు అదానీ గంగవరం పోర్టు కాలుష్యం నుంచి రక్షణ కల్పించాలని తమ సమస్యలను విన్నవించారు. ఆనందపురంలో భీమిలి, దొరతోట రోడ్డు విస్తరణను 200 అడుగుల నుంచి వంద అడుగులకు తగ్గించాలని కోరారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కొన్ని సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని, ఇందుకు అందరూ కలిసి రావాలని నాయకులు కోరారు. కర్నూలు నగరంలోని 9, 10, 11, 35వ వార్డులో సిపిఎం నాయకులు పర్యటించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు, బండి ఆత్మకూరులోనూ నాయకులు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.