బిల్లులు చెల్లించకపోతే ఎలా బతుకుతాం

  • జీతాలందకపోవడంతో అప్పులు చేస్తున్నాం
  • చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీ రైతులు, కార్మికుల గోడు
  • సమస్యలు పరిష్కరించాలి : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి, చోడవరం విలేకరి : ‘గత సీజన్లో టన్నుకు ఇవ్వాల్సిన రూ.200 ఇవ్వలేదు. ఈ ఏడాది చెరుకు బిల్లు ఒకసారి కూడా చెల్లించలేదు. బండి చెరకును ఫ్యాక్టరీకి తోలడానికి మూడు వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. పాల ధరను విశాఖ డెయిరీ తగ్గిస్తోంది. ఇక ఎలా బతకాలి?’ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వద్ద చెరకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన ప్రజా చైతన్య యాత్రలో చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీ చెరకు యార్డులో రైతులతోనూ, ఫ్యాక్టరీలో కార్మికులతోనూ వి.శ్రీనివాసరావు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘ఫ్యాక్టరీ నడిస్తే రైతులకు మంచిది. వేసిన చెరకు దాసుకోలేం. ఇదే మాకు ఆధారం. బిల్లులు చెల్లించకపోతే ఎలా బతకాలి’ అని గాంధీగ్రామ్‌కు చెందిన రైతు శ్రీనివాసరావు అన్నారు. ‘మూడు నెలల నుంచి జీతం అందకపోవడంతో అప్పు చేస్తున్నాం’ అని కాంట్రాక్టు కార్మికుడు ముసలి నాయుడు వాపోయారు. ఆరు మిషన్లు దగ్గర ఆరుగురు కార్మికులు పనిచేయాల్సిన చోట ఇద్దరితో చేయించడంతో ఒత్తిడికి గురవుతున్నామని కార్మికులు తెలిపారు. రైతులు శిలపరశెట్టి శ్రీనివాసరావు, దాడి అప్పారావు, సోమునాయుడు మాట్లాడుతూ పాత బకాయిలు, సరఫరా చేసిన చెరకు బిల్లు ఒక రూపాయీ చెల్లించలేదన్నారు. ఫ్యాక్టరీ తరచూ ఆగిపోవడంతో రోజుల తరబడి పశువులతో ఫ్యాక్టరీ వద్ద పడికాపులు కాస్తున్నామని తెలిపారు.

ఫ్యాక్టరీని నడపలేనివారు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? : వి శ్రీనివాసరావు

సహకార రంగంలోని ఒకే ఒక్క సహకార సుగర్‌ ఫ్యాక్టరీని నడపలేని వారు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. సుగర్‌ ఫ్యాక్టరీని లాభాల్లో నడిపించి తమ సమర్ధతను ప్రభుత్వం నిరూపించుకోవాలన్నారు. ఫ్యాక్టరీని ఎలా కాజేయాలని అనకాపల్లి ఎంపి సిఎం రమేష్‌ ఆలోచించకుండా నిధులు రాబట్టే పనిచేయాలని సూచించారు. మిట్టల్‌ స్టీల్‌ కోసం తిరుగుతున్న ఎంపి…. సుగర్‌ :ఫ్యాక్టరీ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. పార్టీలకతీతంగా ఫ్యాక్టరీ పరిరక్షణకు రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఫ్యాక్టరీ పరిరక్షణకు జరిగే పోరాటంలో సిపిఎం ముందుంటుందని తెలిపారు. చోడవరం చెరకు యార్డులో రైతులు, ఫ్యాక్టరీలో కార్మికులతో మాట్లాడిన అనంతరం ఫ్యాక్టరీ ఎండి సన్యాసినాయుడును వి.శ్రీనివాసరావు కలిసి రైతుల, కార్మికుల సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ బకాయిలు చెల్లించి చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీ రైతులను, కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. బకాయిల చెల్లింపునకు రూ.35 కోట్లు, ఫ్యాక్టరీ ఆధునీకరణకు రూ.350 కోట్లు ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. చెరకు సరఫరా చేసిన రైతులకు క్రషింగ్‌ ప్రారంభం నుంచి బిల్లు చెల్లించకపోవడంతో పెట్టుబడులకు అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు. బయట ట్రేడర్ల కంటే రూపాయి తక్కువ ధరకు పంచదార సరఫరా చేస్తారంటున్న చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీ నుంచి కొనుగోలు చేసేందుకు సివిల్‌ సప్లరు విభాగం ముందుకురావాలని కోరారు. అడ్వాన్స్‌ కింద ఆ శాఖ కొంత మొత్తం చెల్లిస్తే రైతులకు బకాయిలు తీర్చడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. చోడవరం సహకార చక్కెర ఫ్యాక్టరీకి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా, ఉత్పత్తి అయిన పంచదారకు మార్కెట్‌ సౌకర్యం కల్పించకుండా దుంప నాశనం చేయడానికి పాలకులు కంకణం కట్టుకున్నట్లుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ప్రకారం క్రషింగ్‌ ఎక్కువ జరగాల్సి ఉండగా, క్రషింగ్‌ తగ్గిపోతోందని తెలిపారు. ప్రజలందరినీ పెట్టుబడిదారులుగా మార్చుతామన్న చంద్రబాబు… రైతుల ఆధ్వర్యంలోని సహకార ఫ్యాక్టరీపై శీతకన్ను ఎందుకువేస్తున్నారని ప్రశ్నించారు. సుగర్‌ ఫ్యాక్టరీని కాపాడకుండా గుడ్‌ గవర్నెన్స్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నినాదాలు ఇస్తే ప్రయోజనంలేదన్నారు. ప్రధాని వద్ద పలుకుబడి ఉందని చెప్పుకొనే ఎంపి సిఎం రమేష్‌… సుగర్‌ ఫ్యాక్టరీకి నిధులు ఎందుకు రాబెట్టడంలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, ఆర్‌.శంకర్రావు, జి.శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️