అనుమతుల కోసం ప్రతిపాదన : జెన్‌కో ఎమ్‌డి చక్రధర్‌బాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎగువ సీలేరు వద్ద 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతుల కోసం కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు జెన్‌కో ఎమ్‌డి కెవిఎన్ చక్రధర్‌బాబు వెల్లడించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ నుంచి ఈ ప్రతిపాదనలు వెళ్లాయని చెప్పారు. రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను అందుకోవడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై జెన్‌కో అధికారులతో వర్చువల్‌గా శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు ముందస్తుగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను చక్రధర్‌బాబు ఆదేశించారు. ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.7,380 కోట్లుగా అంచనా వేసినట్లు తెలిపారు. పీక్ అవర్స్‌లో ప్రతిరోజూ 10 మిలియన్ యూనిట్లు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు దేశంలోనే అత్యుత్తమ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు. ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామాల్లో విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలకు సంబంధించి వివిధ చర్యలు, ప్రాజెక్టు నిర్వహణ, నిర్మాణ సమయంలో పర్యావరణ నిర్వహణ ప్రణాళికల కోసం కేటాయించిన బడ్జెట్ వివరాలు, పర్యావరణ అధ్యయనాలు, అటవీభూమి క్లియరెన్స్ వంటి అంశాలపై నిపుణుల కమిటీ అంచనా వేసిందన్నారు.
2030 నాటికి కేంద్ర ప్రభుత్వం 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను స్థాపించేలా, 2070 నాటికి సున్నా ఉద్గారాలను సాధించేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు సౌర, పవన వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో నిర్దిష్ట టైం బ్లాక్‌లలో మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే కొనుగోలు అడ్డంకిని సరిచేయొచ్చని చెప్పారు. ఈ సమావేశంలో జెన్‌కో హైడల్ డైరెక్టరు ఎం సుజయ కుమార్, చీఫ్ ఇంజినీర్లు వై కోటేశ్వరరావు, జిఎం వాసుదేవరావు, ఎస్‌ఇలు పి రవీంద్రారెడ్డి, ఎల్ స్వామి నాయుడు, బి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
