ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లండి

Mar 17,2025 00:42 #CPM AP, #CPM Praja Chaitanya Yatra

సిపిఎం నెల్లూరు రూరల్‌ మహాసభలో వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా ఉద్యమానికి ప్రత్యేక చరిత్ర ఉందని, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఏన్నో పోరాటాలు నిర్వహించారని, రానున్న రోజుల్లో ఉద్యమాలను మరింత ముందుకు తీసుకెళ్లి ప్రజలకు చేరువ కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్జాన కేంద్రంలోని మినీహాలులో సిపిఎం నెల్లూరు రూరల్‌ 4వ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత పార్టీ పతాకాన్ని సిపిఎం సీనియర్‌ నాయకులు రమమ్మ ఆవిష్కరించారు. అనంతరం ప్రారంభ సభలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ నెల్లూరు ప్రాంతంలో ఇళ్ల స్థలాల పోరాటాలు, తాగునీరు, కనీస సౌకర్యాలు, స్థానిక సమస్యలపై జరిగిన పోరాటాలను ప్రస్తావిస్తూ, రానున్న కాలంలో వీటిని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. వైసిపి ప్రభుత్వం పోయి టిడిపి ప్రభుత్వం వచ్చింది తప్ప, పాత విధానాలే కొనసాగుతున్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా నేడు కమ్యూనిజం పుంజుకుంటుందన్నారు. ఇది మరింత ఉధృతంగా ముందుకు రానుందని పేర్కొన్నారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ గణనీయంగా పుంచుకొని అధికారంలో వచ్చిందని గుర్తు చేశారు. కమ్యూనిజానికి కాలం చెల్లిందని చంద్రబాబు నాయుడు ఒకప్పుడు చెప్పారని, వాస్తవానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు విధానాలకు కాలం చెల్లిందని వివరించారు. మారాల్సింది కమ్యూనిస్టులు కాదని, చంద్రబాబునాయుడని అన్నారు. అవినీతి అంతుచూస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నారని, విద్యుత్‌ కొనుగోలు కోసం సెకీతో ఒప్పందం విషయంలో జరిగిన అవినీతిలో అదానిని, జగన్‌ను ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. మత విద్వేషాలు పెంచడానికి బిజెపి ప్రయత్నిస్తోందని, మతోన్మోద ప్రమాదం పొంచి ఉందని, కుంభమేళలో ఏం జరిగిందో చూశామని అన్నారు. తామే దేశాన్ని శాసిస్తామని అఘోరాలు చెబుతున్నారని, దీనిని బిజెపి పోత్సహిస్తోందని విమర్శించారు. సనాతన ధర్మం పేరుతో పవన్‌ కల్యాణ్‌ నేడు ఊరూరా తిరుగుతున్నారని, ఏడేళ్ల కిందట బిజెపిని తిట్టిన ఆయన ఇప్పుడు ఆ పార్టీని మోస్తున్నారని అన్నారు. భాష పేరుతోనూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హిందీని దేశంపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది సరికాదని, మాతృభాషలోనే చదువు చెప్పాలని అన్నారు. నియోజకవర్గాల డీ లిమిటేషన్‌పై ప్రస్తుతం చర్చ జరుగుతోందని, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు వస్తాయని, తక్కువ జనాభా ఉంటే తక్కువ వస్తాయని, దీనివల్ల తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. సీట్ల నిష్పత్తి మారకుండా డీలిమిటేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. డీలిమిటేషన్‌ విషయంలో మోడీకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, జగన్‌ దాసోహం అవతున్నారని విమర్శించారు. మోడీ కార్పొరేట్‌ విధానాలు, మతోన్మోద విధానాలు, అప్రజాస్వామిక విధానాలు దేశానికి ప్రమాదకరమని, దీనిని ఓడించడమే రాబోయే రోజుల్లో రాజకీయ కర్తవ్యం కావాలని పిలుపునిచ్చారు. బిజెపిని ఓడించాలంటే వామపక్షాలు, అందులోనూ సిపిఎం బలపడాలన్నారు. స్థానిక సమస్యలసై నిరంతరంగా పోరాటాలు సాగించాలని, ప్రజలను నిత్యం అంటిపెట్టుకొని ఉండాలని సూచించారు. వర్గ పోరాటాలు, ప్రజా పోరాటాలు ఉధృతం చేసి స్దానిక నాయకత్వాన్ని పెంపొందించుకోవాలని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మహాసభకు అధ్యక్షవర్గంగా షాహీనా బేగం, సంపత్‌, కొండ ప్రసాద్‌ వ్యవహరించారు. సంతాప తీర్మానాన్ని ఎం.సుధాకర్‌ ప్రవేశపెట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యదర్శిగా కొండా ప్రసాద్‌

సిపిఎం నెల్లూరు రూరల్‌ కార్యదర్శిగా కొండా ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 21 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.

➡️