పోలీసులపై ఇసి కొరడా !

Feb 12,2024 10:06 #AP police, #whips
  • ఉప ఎన్నికల్లో అక్రమాలపై నలుగురు సస్పెన్షన్‌, ఒకరు విఆర్‌కి

ప్రజాశక్తి- తిరుపతి సిటీ : తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో అక్రమాలపై ఎలక్షన్‌ కమిషన్‌ మరింత జోరుగా ముందుకు వెళుతోంది. అక్రమాలకు పోలీసులను కూడా బాధ్యులను చేస్తూ ఐదుగురిపై చర్యలు తీసుకుంది. వారిలో నలుగురిని సస్పెండ్‌ చేయగా, ఒకరిని విఆర్‌కి బదిలీ చేసింది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్లు నమోదుకు, అక్రమాలకు పాల్పడ్డారంటూ తిరుపతి ఆర్‌ఒగా వ్యవహరించిన అప్పటి తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ గిరిషాను, ఎఆర్‌ఒగా వ్యవహరించిన చంద్రమౌళిరెడ్డిని సస్పెండ్‌ చేసింది. ఉప ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు అందినా సరైన సమయంలో కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీసులపై చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశం మేరకు… అప్పట్లో ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సిఐగా విధుల్లో ఉన్న శివప్రసాద్‌ రెడ్డి, వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సిఐగా విధుల్లో ఉన్న శివప్రసాద్‌, తిరుపతి ఈస్ట్‌ ఎస్‌ఐ జయస్వాములు, హెడ్‌ కానిస్టేబుల్‌ ద్వారకానాథ్‌ రెడ్డిని సస్పెండ్‌ చూస్తూ, ప్రస్తుత అలిపిరి సిఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న అబ్బన్నను విఆర్‌కు బదిలీ చేస్తూ అనంతపురం రేంజ్‌ డిఐజి అమ్మిరెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. మరింతమందిపై చర్యలు ఉంటాయనే ప్రచారం అధికారుల్లో గుబులు రేపుతోంది.

➡️