అమరావతి : వైసిపి నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌ను ఏపీ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో బాలికపై అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేశారంటూ … ఆయనపై ఫిర్యాదులు రావడంతో తిరుపతి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు చెవిరెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన బాలిక (14)పై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేశారన్న ఆరోపణలతో చెవిరెడ్డిపై కేసు నమోదైంది. వాస్తవాలు నిర్ధారించుకోకుండా అసత్య ప్రచారం చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు పెట్టారు. యర్రావారిపాలెం మండలానికి చెందిన బాలిక.. పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా ముసుగు వేసుకున్న దుండగులు తనపై దాడిచేసి మత్తు మందు తాగించారని తల్లిదండ్రులను నమ్మించింది. ఘటన పూర్వాపరాలు తెలుసుకోకుండా, వాస్తవాలు నిర్థారించుకోకుండానే బాలిక చదివే పాఠశాలకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. ఆమెపై అత్యాచారం జరిగిందని, ఆమెకు అండగా ఉంటామని వ్యాఖ్యానించినట్లు పోలీసులు గుర్తించారు. బాలికకు వైద్యపరీక్షలు చేసి అత్యాచారం జరగలేదని పోలీసులు తెలిపినా, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసినట్లు తేల్చారు. ఈ కేసులో బాధితురాలు బాలిక కావడం వల్ల.. ఆమెతోపాటు కుటుంబసభ్యుల గుర్తింపు ప్రచారం చేయడం పోక్సో చట్టం ప్రకారం ఉల్లంఘన అవుతుంది. అసత్య ప్రచారం చేసి తమను మనోవేదనకు గురిచేశారంటూ బాలిక తండ్రి ఆయనపై ఫిర్యాదు చేశారు.