క్వింటాలు మిర్చికి రూ.20 వేలు ఇవ్వాలి

  • 16నగుంటూరు మిర్చి యార్డు వద్ద ధర్నా
  • ఎపి రైతు సంఘం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మిర్చికి క్వింటాలుకు రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 16న గుంటూరు మిర్చి యార్డు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు ఎపి రైతు సంఘం తెలిపింది. ఈ ధర్నాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదంచేయాలని కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మిర్చి పంటకు ధర లేక లక్షలాదిమంది రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, కేేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు క్వింటాలుకు రూ.11,871లు కనీస ధరగా ప్రకటించినప్పటికీ ఆచరణలో అది కూడా ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకే మార్కెట్‌లో రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం కింద రైతులను ఆదుకుంటామని, కనీస ధరకు కొనుగోలు చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజుల క్రితం ప్రకటన చేశాయని, కానీ, ఇప్పటి వరకు ఏ ఒక్కరైతు నుంచి ఒక్క క్వింటాలు మిర్చికూడా ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనుగోలు చేయలేదన్నారు. మిర్చి కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్దిష్టమైన ఆదేశాలు కానీ,గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయకుండా, రైతులను మాయమాటలతో మోసం చేస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధరగా క్వింటాలుకు రూ.11,871లు ప్రకటించినప్పటికీ గుంటూరు మార్కెట్‌ యార్డులో మిర్చి క్వింటాలు రూ.8,9 వేలు కూడా ధర ఇస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఎపిరైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌రెడ్డిలు తెలిపారు. గుంటూరు మిర్చియార్డులో రైతులను మోసం చేస్తున్న మిర్చి వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్‌యార్డులో అమ్మిన రైతులకే కాకుండా బయట ప్రైవేట్‌ వ్యాపారులకు మిర్చి అమ్మిన రైతులకు కూడా మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ పథకం కింద ధరలో ఉన్న తేడా ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నామన్నారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: ఎపిరైతు సంఘం
అకాలవర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎపిరైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈనెల 13న కురిసిన వర్షాలకు ఎన్‌టిఆర్‌, కృష్ణ, గుంటూరు , ప్రకాశం జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. ముఖ్యంగా బర్లీ పొగాకు, వరి పంటలు కళ్ళాల్లోనే తడిచి ముద్దయ్యాయన్నారు. వడగండ్ల వానతో మామిడి,పంట నేలరాలిందనిచ మొక్క జొన్న పంట కూడా దెబ్బతిందన్నారు, ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన రైతులకు పంటల బీమా అమలు చేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఎపిరైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌రెడ్డిలు విజ్ఞప్తి చేశారు.

➡️