క్విట్‌ డబ్ల్యుటిఒ

  • మద్దతు ధర కల్పించాలని, లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని ర్యాలీలు

ప్రజాశక్తి – యంత్రాంగం : వ్యవసాయ రంగంలో వాణిజ్య సంస్థల ప్రవేశాన్ని, డబ్ల్యుటిఒ ఒప్పందాలను వ్యతిరేకిస్తూ, మద్దతు ధరల చట్టం చేయాలని, లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా, ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నిరసనలు తెలిపారు. పలుచోట్ల డబ్ల్యుటిఒ ఒప్పంద ప్రతులను దగ్ధం చేశారు.

కృష్ణా జిల్లా గన్నవరంలో ట్రాక్టర్‌, బైకు ర్యాలీలు నిర్వహించారు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ జాతీయ రహదారి మీదుగా బస్టాండ్‌ వరకు వెళ్లి, తిరిగి పురవీధుల్లో గుండా గాంధీ బొమ్మ సెంటర్‌ కు చేరుకుంది. ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు మాట్లాడుతూ.. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, మన దేశ రైతులకు వ్యతిరేకంగా ఉన్న డబ్ల్యుటిఒ (ప్రపంచ వాణిజ్య ఒపందం)ను బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు. తెనాలిలో నిర్వహించిన ర్యాలీలో ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌, టిడిపి, బిజెపి పార్టీలు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి వైఫల్యం చెందాయని విమర్శించారు. పెదకాకానిలో జాతీయ రహదారిపై నిర్వహించిన నిరసనలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్రాపు సూర్యనారాయణ పాల్గొని ప్రసంగించారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన ర్యాలీలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతపురం టవర్‌క్లాక్‌ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు తదితరులు పాల్గొన్నారు.కర్నూలు బళ్లారి చౌరస్తా నుంచి కలెక్టరేట్‌ వరకూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నంద్యాలలో నూనెపల్లె, కోవెలకుంట్ల కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏలూరులో డబ్ల్యుటిఒ ఒప్పంద ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సిఐటియు కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్‌ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఒంగోలులో కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఆర్‌టిసి డిపో వరకు ర్యాలీ చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా చేశారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.వర్మ పాల్గొన్నారు.

అనకాపల్లిలోని నెహ్రూ చౌక్‌ జంక్షన్‌లో అంబేద్కర్‌ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద రైతు, కార్మిక సంఘాలు ధర్నా చేశాయి.

➡️