రబీ గట్టెక్కేదెలా!

  • ఏలేరు నుంచి సాగునీరు అందేనా?
  • వరదలకు 6 మండలాల్లో 280 చోట్ల గండ్లు
  • పనులు త్వరితగతిన చేపడితేనే రైతులకు మేలు

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : ఈ ఏడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఏలేరు ఆయకట్టు కింద రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. నాలుగు రోజుల పాటు వచ్చిన వరదలకు ఖరీఫ్‌ పంటను కోల్పోయారు. అనేక చోట్ల భారీ గండ్లు పడ్డాయి. కానీ, నేటికీ పూర్తి స్థాయిలో గండ్లను పూడ్చలేదు. రబీకి ఏలేరు నుంచి సాగునీరు సక్రమంగా అందే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో, రబీ గట్టెక్కేదెెలా? అంటూ పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో రబీ సాగును కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. కాకినాడ జిల్లాలో 20 మండలాల్లో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టాలని కార్యాచరణలో పేర్కొన్నారు. మరో 20 వేల ఎకరాల్లో మినుము, పెసర వంటి అపరాలు సాగు చేయనున్నారు. గోదావరి తూర్పు డెల్టా పరిధిలో 1,05,341 ఎకరాలకు, పిఠాపురం బ్రాంచి కెనాల్‌ కింద 32,507 ఎకరాలకు, ఏలేరు కింద 53,017 ఎకరాలకు సాగునీటికి ఆమోదం తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రబీ సీజన్‌ ప్రారంభం కానుండగా, 31లోగా నాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇదే సందర్భంలో సాగునీటి వ్యవస్థల పటిష్టతకు రూ.6 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్‌ ప్రకటించారు.

గండ్లు పూడ్చేది ఎప్పుడో?

ఏలేరు వరదల కారణంగా ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రాజెక్టు పరిధిలో రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. 19 ఏళ్ల తర్వాత ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చింది. గత సెప్టెంబర్‌ 9 నుంచి 12 వరకు భారీ వరదల వల్ల జగ్గంపేట, కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల్లో 208 చోట్ల ఏలేరు కాలువ వెంబడి గండ్లు పడ్డాయి. సుమారు 70 వేల ఎకరాల్లో వరి నేలమట్టమైంది. ఈ గండ్లు పూడ్చేందుకు రూ.19.53 కోట్లు అవసరం అవుతాయని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ, నిధులు విడుదల కాలేదు. యుద్ధప్రాతిపదికన తాత్కాలికంగా గండ్లు పూడ్చేందుకు కలెక్టర్‌ రూ.5.5 కోట్ల టెంపరరీ ఫండ్స్‌ను కేటాయించారు. కలెక్టర్‌ ఆదేశాలతో 67 పనులను చేపట్టారు. ఇందులో భాగంగా ఇసుక బస్తాలతో గండ్ల వద్ద అడ్డుకట్టు వేశారు. గండ్లను పూడ్చేందుకు మెటీరియల్‌ తీసుకువెళ్లేందుకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పొలాల్లోంచి వెళ్లాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గండ్లు పూడిక పనులు ముందుకు సాగడం లేదు. మరో రెండు రోజుల్లోనే రబీ సీజన్‌ ప్రారంభం కానుంది. అయితే, పూర్తి స్థాయిలో గండ్లు పూడ్చే పనులను ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఇంకా స్పష్టత లేదు. దీంతో, రైతులు కలవరం చెందుతున్నారు. రబీకు సాగునీరు సక్రమంగా అందుతుందా? లేదా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో ప్రకృతి వైపరీత్యాలతో పంటను నష్టపోగా, రబీలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సాగునీరు సక్రమంగా అందే పరిస్థితి లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి శాశ్వతంగా గండ్లు పూడ్చి సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రబీకి నీటి ఎద్దడి లేకుండా చర్యలు : శేషగిరి, ఏలేరు ప్రాజెక్టు ఇరిగేషన్‌ డివిజన్‌, పెద్దాపురం

గండ్లు పూడిక పనుల కోసం రూ.19.53 కోట్లు అవసరం ఆవుతాయని ప్రతిపాదనలు పంపాము. ఈ నిధులు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. రబీకి ఎటువంటి ఆటంకమూ లేకుండా సగం పనులను పూర్తి చేశాం. త్వరలోనే మిగిలిన పనులూ పూర్తి చేస్తాం. రబీకి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

➡️