రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల ఆగ్రహం

Apr 3,2024 17:14 #pensions, #pensions in AP

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం గ్రామ, వార్డు సచివాలయాలు వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాచారు. పెన్షన్లు ఇవ్వకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల వృద్ధులు స్పృహ తప్పి పడిపోయారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ బుధవారం ఉదయం గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రారంభం కావాల్సి ఉంది. పింఛన్ల పంపిణీ విషయం తెలుసుకున్న లబ్ధిదారులు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సచివాలయాల వద్ద వేచి ఉన్నారు. ‌అయితే ఇప్పటికీ పింఛన్ల పంపిణీకి సంబంధించిన నగదు సంబంధిత అధికారులకు అందలేదన్నది సమాచారం. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఏ నిమిషమైనా నగదు వస్తుందని, ఆ మేరకు పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో సచివాలయాల వద్ద లబ్ధిదారులు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొనడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5గంటల తరువాత పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. దీంతో ఆయా సచివాలయాలల్లో భారీగా లైన్లలో నిలబడి ఉన్నారు.

పెన్షన్ కోసం వేచివున్న వృద్దుడు మృతి

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం, ఎర్ర వారి పాలెం మండలంలోని నెరబైలు సచివాలయం దగ్గర పింఛను తీసుకోవడానికి వేచి ఉన్న వృద్ధుడు షేక్ అసం సాహెబ్ కళ్ళు తిరిగి పడిపోవడంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లే లోగా మార్గమధ్యంలోనే చనిపోయినట్టు స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ : పొన్నూరు పట్టణం తాపింపేటలోని ఐదవ సచివాలయంలో ఉదయం నుండి పడిగాపులు కలిసిన వృద్ధులకు వికలాంగులకు వేచి చూడాల్సి వచ్చింది. సాయంత్రం నాలుగున్నర గంటల నుండి పెన్షన్ పంపిణీ మొదలుపెట్టారు.

విజయనగరం జిల్లా మెరక ముడిదాం మండలం గొల్లల వలస సచివాలయం వద్ద పెన్షన్ల కొరకు పడి గాపులు

అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామంలో 4 గంటల సమయంలో  సర్వర్లు పనిచేయలేదన్నారు.

ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ సచివాలయంలో పింఛన్ల కోసం ఉదయం 8 గంటల నుంచి ఎదురుచూస్తున్న అవ్వతాతలు, వితంతువులు, వికలాంగులు.

 

బాపట్ల జిల్లా భట్టిప్రోలు పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వికలాంగులు

కడప జిల్లా మైదుకూరులో సంక్షేమ పెన్షన్ల కొరకు వృద్ధులు తదితరులు నిరీక్షణ

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెత్త కుప్పం గ్రామ సచివాలయం వద్ద పింఛన్ల కోసం వేచి ఉన్న వృద్ధులు. సచివాలయ సిబ్బంది నగదు తీసుకురావడానికి బ్యాంకులకు వెళ్లి ఉన్నారు. 12 గంటల అవుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాలేదు.

అల్లూరి జిల్లా – అరకులోయ రూరల్ :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో నేటి నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతాయని అధికారులు ఆదేశాల మేరకు జారీ చేశారు. అరకువేలి మండలం లోతేరు పంచాయితీ పరిధి తోటవలస, వివిధ గ్రామనికి చెందిన పింఛన్ల దారులు మూడు, నాలుగు కిలోమీటర్లు దూరంలో పింఛన్లు ఇస్తారని భావించి వృద్ధులు,వికలాంగులు లోతేరు గ్రామ సచివాలయం వద్ద కు కాలినడన చేరుకున్నారు. అయితే సచివాలయ సిబ్బందికి డబ్బులు అందలేదని వారు బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుని రావడానికి వెళ్లారని మధ్యాహ్నం తర్వాత అంటూ మధ్యాహ్నం తర్వాత రావాలంటూ కొన్ని సచివాలయాల్లో సిబ్బంది చెపుతున్నారు.

పెన్షన్ కు వెళ్తూ స్పృహ కోల్పోయిన వృద్ధుడు

కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామంలో సచివాలయం 3 పరిధిలోని ఎస్టీ కాలనీకి చెందిన పొన్నా సుబ్బారావు బుధవారం ఉదయం పెన్షన్ కు వెళుతూ స్పృహ కోల్పోయి రోడ్డు పక్కన పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించారు. అతనిని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు.

ఏలూరు జిల్లా  కైకరం-2 సచివాలయం వద్ద ఫించన్ పెన్షన్ దారులు బుధవారం పడి గాపులు కాచారు. పెన్షన్లు ఉదయం 9 గంటలకు ఇస్తారని అధికారులు చెప్పడంతో ఉంగుటూరు మండలంలో సచివాలయం కార్యాలయం వద్ద పెన్షన్ దారులు పడిగాపులు కాచారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పెన్షన్లు ఇస్తామని అధికారులు తీరుబడిగా చెప్పడంతో పెన్షన్ దారులు నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోయారు.

శ్రీకాకుళం జిల్లా -సంతబొమ్మాళి : నేటి వరకు పెన్షన్ అమౌంట్ జమ అకౌంట్ కు కాకపోవడంతో పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నేటి నుండి పెన్షన్ లుకు సచివాలయం వద్ద సచివాలయం సిబ్బంది పెన్షన్ పంపిణీ చేస్తారని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎటువంటి ఏర్పాటులు చేయలేదని పెన్షన్ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం జిల్లా – నార్పల : మండల కేంద్రంలోని స్థానిక సచివాలయం వద్ద పలువురు వృద్ధులు పింఛన్ డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈనెల మూడవ తేదీ వాలంటీర్లు కాకుండా సచివాలయ ఉద్యోగులే సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు ఉదయం నుండే పలువురు వృద్ధులు సచివాలయాల వద్ద పించన్ డబ్బుల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఎండలకు పింఛన్ కోసం వచ్చిన పండుటాకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

 

➡️