- పిడిఎఫ్ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు
- తొత్తరమూడిలో ముగిసిన అంత్యక్రియలు
ప్రజాశక్తి – అమలాపురం(డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా) : ప్రజల మనసుల్లో కుడుపూడి రాఘవమ్మ చిరస్థాయిగా నిలిచి ఉంటారని పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు అన్నారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తొత్తరమూడిలో మంగళవారం రాఘవమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. స్వగ్రామం తొత్తరమూడిలో బుధవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ఆమె భౌతికకాయంపై సిపిఎం జెండాను ఉంచి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఐవి మాట్లాడుతూ ఒక మహిళ కమ్యూనిస్టుగా మారడం ప్రజా సమస్యలపై గొంతు విప్పడమంటే అప్పుడున్న పరిస్థితుల్లో సాధారణ విషయం కాదన్నారు. ఎర్ర జెండా పట్టుకుని ఏళ్ల తరబడి ప్రజా సమస్యలపై పోరాడిన ధీర వనిత రాఘవమ్మ అని కొనియాడారు.
ఒకే కుటుంబం నుంచి భార్యాభర్తలు ప్రజా సమస్యల కోసం ఉద్యమంలో పనిచేయడం అరుదైన విషయమన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘం, ప్రజా సంఘాల్లో రాఘవమ్మ చేసిన పోరాటాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆమె అంత్యక్రియల్లో సిపిఎం కోనసీమ జిల్లా జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, కాకినాడ జిల్లా సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జి, బేబిరాణి, కెఎస్ శ్రీనివాస్, ఎం రాజశేఖర్, ఐద్వా సీనియర్ నాయకులు టి సావిత్రి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.