టి.నర్సాపురానికి రైల్వే కూత..!

Feb 22,2024 11:40 #sattupalli

మండలం మీదుగా రైల్వేలైన్‌కు ఆ శాఖ గ్రీన్‌సిగల్‌

 మెట్ట ప్రాంతంలో జోరుగా చర్చ

ఇప్పటికే నిర్మాణంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే

టి.నరసాపురం కేంద్రంగా నేవీ లోడింగ్‌ పాయింట్‌

అన్ని రకాల అభివృద్ధికి అవకాశం

ప్రజాశక్తి – టి.నరసాపురం (ఏలూరు జిల్లా) : ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలో భవిష్యత్తులో రైలు కూత విన్పించనుంది. అటు హైదరాబాద్‌, ఇటు వైజాగ్‌ తదితర ప్రాంతాలకు రవాణా సౌకర్యం విస్తరించనుంది. మండల ప్రజలు ఎవరూ ఊహించని విధంగా జిల్లాలో కొవ్వూరు నుండి జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, అశ్వారావుపేట మీదుగా భద్రా చలం వెళ్లాల్సిన రైల్వేలైన్‌ కొవ్వూరు నుండి జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం మీదుగా గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వెంబడి మండలానికి రాబోతుంది. దక్షిణమధ్య రైల్వే అధికారులు మండలం మీదుగా రైల్వేలైన్‌ ఏర్పాటుకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. దీనిపై జిల్లాలో, ప్రధానంగా మెట్టప్రాంతంలో ఇప్పటికే పెద్దఎత్తున చర్చ సాగుతోంది. జిల్లాలో మారుమూల ప్రాంతంగా ఉన్న టి.నరసాపురం మండలానికి రైల్వేలైన్‌ రావడం హర్షణీయమని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మండలం మీదుగా గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదే క్రమంలో మరో సౌకర్యవంతమైన ప్రయాణ, రవాణా సౌకర్యం రైల్వేలైన్‌తో ఏర్పడుతుందని పలువురు చెబుతున్నారు.కొవ్వూరు-భద్రాచలం రోడ్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి దక్షిణమధ్య రైల్వే పచ్చ జెండా ఊపిందని తెలుస్తోంది. ఏప్రిల్‌ 1న సత్తుపల్లిలో ఈ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అప్పటికి ఎన్నికల కోడ్‌ రానుండటంతో ఈ ప్రచారంపైనా పలు అనుమానాలు నెలకొన్నాయి. అయితే దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఆరుణ్‌ కుమార్‌ జైన్‌ నేతృత్వంలో ఈ లైన్‌ నిర్మాణ పనులకు సాగుతున్నాయని, 2030 మార్చి నాటికి 151 కిలోమీటర్ల రైల్వేట్రాక్‌ నిర్మాణమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. దీనికిగాను రూ.2154 కోట్లు ఖర్చవుతుందని అంచనా వ్యయం రూపొందించినట్లు సమాచారం. దీనికి రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన అనుమతులు కూడా వచ్చాయని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే హైదరాబాద్‌-రాజమండ్రి మధ్య రాకపోకలు సాగించేవారికి మరింత సులభ రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే సుమారు 75 కిలోమీటర్ల దూరం తగ్గు తుందని అధికారుల అంచనా. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావుతోపాటు పలువురు ఎంపీలు పలుమార్లు రైల్వే ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్‌ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందని చెబుతున్నారు.

1960లో జీలుగుమిల్లి మండలం మీదుగా లైన్‌ ఏర్పాటుకు సర్వే

భద్రాచలం రోడ్‌-కొవ్వూరు రైల్వే లైన్‌ ఏర్పాటుకు 1960లోనే తొలి సర్వే జరిగింది. అప్పటి అవసరాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అనేక ప్రతిపాదనలు చేశారు. కొత్తగూడెం (భద్రాచలం రోడ్‌) స్టేషన్‌ నుంచి సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లోని ఏజెన్సీ గ్రామాలతోపాటు, కొయ్యలగూడెం మండలం రాజవరం, పొంగుటూరు మీదుగా కొవ్వూరు వరకూ ఈ లైన్‌ నిర్మించాలని నాటి సర్వే సాగింది.

తర్వాత పలు దఫాలు సర్వేలు సాగినా అవేమీ కార్యరూపం దాల్చలేదు. అయితే 2004 తరువాత సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభం కావడంతో తెలంగాణ ప్రభుత్వం కొత్తగూడెం-సత్తుపల్లి మధ్య బొగ్గు తరలించేందుకు రైల్వేలైన్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కాస్ట్‌ షేరింగ్‌ పధ్ధతిలో సింగరేణి యాజమాన్యం రూ.706 కోట్ల ఖర్చు భరించగా, రైల్వే శాఖ రూ.85 కోట్లు వెచ్చించి ట్రాక్‌ ఏర్పాటు చేశారు. దీంతో సత్తుపల్లికి రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. ఇక కొవ్వూరు- సత్తుపల్లికి మధ్య రైల్వే లైన్‌ నిర్మాణానికి డిమాండ్‌ ఉండటంతో ఖమ్మం- దేవరపల్లి గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే వెంబడి కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దీంతో మండలంలోని బొర్రంపాలెం, టి.నరసాపురం గ్రామాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పక్కన లైన్‌ ఏర్పాటుకు ప్రణాళికలు చేపట్టినట్లు తెలుస్తోంది.

➡️