వర్ష బీభత్సం

  • ఎన్‌టిఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కుంభవృష్టి
  • జలదిగ్బంధనంలో గుంటూరు, విజయవాడ నగరాలు
  • కొండచరియలు కూలి ఆరుగురు, కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి
  • వాగులో కొట్టుకుపోయి మరొకరి గల్లంతు
  •  చెరువులను తలపించిన విజయవాడ రోడ్లు శ్రీ ముంపులో వేలాది ఎకరాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. శుక్రవారం రాత్రి నుండి శనివారం సాయంత్రం వరకు ఈ రెండు జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో విజయవాడ, గుంటూరు నగరాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లోనూ ఎక్కడ చూసినా రోడ్లమీద వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. విజయవాడ – గుంటూరు మధ్య 30 సెం.మీ వర్షపాతం నమోదుకాగా, విజయవాడలో 18 సెం.మీ, గుంటూరు తూర్పు మండలంలో 25 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఇటీవల సంవత్సరాల్లో ఇదే అత్యధిక వర్షం. దీంతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొండచరియలు విరిగిపడటంతో విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్‌లో ఐదుగురు, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఒకరు మరణించారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో మురుగుకాల్వలోకి కారు కొట్టుకుపోయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌టిఆర్‌ జిల్లా చందర్లపాడులో వాగులో కొట్టుకపోయి మరొకరు మరణించారు. భారీగా వరద నీరు చేరడంతో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామం వద్ద హైవేవైపు వాహనదారులు ఎవ్వరూ రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. విజయవాడలో దుర్ఘాఘాట్‌, ఫ్లై ఓవర్లను మూసివేశారు. ఏలూరు సర్వజన ఆస్పత్రిలో వర్షపు నీరు చేరింది. ఆర్‌టిసి సర్వీసులను అధికారులు రద్దు చేశారు. విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (విటిపిఎస్‌)లో వరద నీరు చేరడంతో విద్యుదుత్పత్తి నిల్చిపోయింది. భారీ వర్షాల కారణంగా విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి 20 రైళ్లను రద్దు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద తుపాన్‌ తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. తీరం దాటే సమయలో గంటకు 55 నుండి 65 కి.మీ మేర గాలులు వీచే అవకాశం ఉంది.

 

ప్రజాశక్తి- యంత్రాంగం : కుండపోత వర్షాలు ఎన్‌టిఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలను అతలాకుతలం చేశాయి. బీభత్సం సృష్టించాయి. జనజీవనం స్తంభించింది. ఎన్‌టిఆర్‌ జిల్లాలో శనివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 111.2 మిల్లీమీటర్లు సగటు వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరం గతంలో ఎన్నడూలేని విధంగా జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఎటువైపు చూసినా మోకాళ్లలోతు నీరు రోడ్లపై నిలిచిపోయింది. భవనాల పైనుండి చూస్తే నగరం నీటిలో తేలియాడుతున్నట్లు కనిపించింది. లోతట్టు ప్రాంతాల్లో పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటరు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో నవుడు మేఘన (25), బోలెం లక్ష్మి (48), లాలు (37), జంపాన అన్నపూర్ణ (65), కామరి సంతోష్‌ (18) ఉన్నారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. రెండు గృహాలు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పర్యటించారు. మృతుల కుటుంబాలను, బాధితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. చందర్లపాడులో ఓ ద్విచక్ర వాహనదారుడు వాగులో కొట్టుకుపోయాడు.

దుర్గగుడి ఘాట్‌ రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు
దుర్గగుడి ఘాట్‌ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రోటోకాల్‌ కార్యాలయంపై కొండరాళ్లు పడ్డాయి. ఘాట్‌ రోడ్డును మూసివేశారు. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్‌లోని ఎరైవల్‌ బ్లాక్‌పైకి రెండడుగుల మేర వర్షం నీరు చేరింది. పార్సిల్‌ గోడౌన్‌లోకి నీరు చేరి పలు రకాల సరుకులు తడిచిపోయాయి. బస్టాండ్‌ ప్రాంతంలోని రైల్వే బ్రిడ్జి వద్ద భారీ స్థాయిలో చేరిన నీటిలో ఐదారు బస్సులు చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. విజయవాడ నుంచి రూరల్‌ ప్రాంతాలకు వెళ్లాల్సిన 13 రూట్లలో 68 ఆర్‌టిసి సర్వీసులను అధికారులు రద్దు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో 20 రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. గన్నవరం విమానాశ్రయంలో విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.

కృష్ణా జిల్లాలో 11,285 ఎకరాల్లో పంటలు మునక
కృష్ణా జిల్లాలో శుక్రవారం ఉదయం 8.30 నుండి శనివారం రాత్రి ఏడు గంటల వరకు 211.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తొమ్మిది మండలాల్లో 11,285 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. బంటుమిల్లి, కృత్తివెన్ను, ఘంటసాల, మొవ్వ, మోపిదేవి, కోడూరు తదితర మండలాల్లో వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పెనమలూరులో పశువులపాక కూలి నాలుగు గొర్రెలు మరణించాయి. కృష్ణా ఇస్ట్రన్‌ డెల్టా బ్యాంక్‌ కెనాల్‌ పొంగి మోపిదేవి మండలం వార్పుపైకి నీరు చేరింది. బందరులో రోడ్లపై మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. గుడివాడ, పెడన మున్సిపాల్టీల్లో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

కాజా హైవేపై వరద నీటి ఉధతి
గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అతి భారీ వర్షం కురిసింది. గుంటూరు తూర్పు మండలంలో 252.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో పగటి పూట 12 గంటల వ్యవధిలో 147 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారికి సమీపంలోని పెదకాకాని మండలం ఉప్పలపాడు వద్ద మురుగు కాల్వలోకి కారు కొట్టుకుపోయి ముగ్గురు దుర్మరణం చెందారు. వారిలో నంబూరు వివా స్కూలు టీచర్‌ నడింపల్లి రాఘవేంద్ర (38), విద్యార్థులు పసుపులేటి సౌదీష్‌ (8), కోడూరి మాన్విత్‌ (9) ఉన్నారు. పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో స్కూలు నుంచి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళగిరిలో కొండచరియలు విరిగిపడి రుక్క నాగరత్నమ్మ (88) మహిళ మృతి చెందారు. తెనాలిలో అత్యధికంగా 170 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మంగళగిరి మండలం కాజా గ్రామం వద్ద హైవేపై వరద నీరు ఉధతంగా రోడ్డుపై ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనదారులు ఎవ్వరూ జాతీయ రహదారి వైపు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తాడికొండ-తుళ్లూరు మధ్య కోటేళ్ల వాగు పొంగి ప్రవహించడంతో రాజధాని వెలగపూడికి రాకపోకలు నిలిచిపోయాయి. తాడికొండ-గుంటూరు-అమరావతి మధ్య కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహించడంతో చప్టాలపైకి నీరు వచ్చింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం గోలి వాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సత్తెనపల్లి మండలం పెదమక్కెన వద్ద చప్టాపై వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలను ఆపివేశారు. భారీ వర్షాలకు గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో దాదాపు లక్ష ఎకరాల్లో వరి పైరు నీటమునిగాయి. వర్షం నీరు బయటకు పంపేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.

నూజివీడులో చెట్టుపై ఒకరు, విద్యుత్‌ స్తంభంపై మరొకరు చిక్కుకున్న వైనం
శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఏలూరు జిల్లాలో 41.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నూజివీడులో పెద్దచెరువుకు గండి పడడంతో ఒక్కసారిగా ముంచెత్తిన వరదకు నూజివీడు బైపాస్‌ రోడ్‌లో చెట్టుపై ఒక వృద్ధుడు, పోతిరెడ్డిపల్లిలో కరెంటు స్తంభంపై ఒక యువకుడు చిక్కుకున్నట్లు శనివారం రాత్రి గుర్తించారు. వారిని రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగినా వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాలేదు. జిల్లా ఎస్‌పి ప్రతాప్‌ శివ కిషోర్‌, నూజివీడు ఆర్‌డిఒ భవాని శంకరి ఆ ప్రాంతంలోనే ఉండి వారు ఇరువురినీ సురక్షితంగా కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి పది గంటల సమయానికి కూడా ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది వారిని చేరుకోవడం సాధ్యం కాలేదు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ముసునూరు మండలంలో అత్యధికంగా 126.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో 96.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. పాలకొల్లులో అత్యధికంగా 199.4 మిల్లీమీటర్లు, పెనుమంట్రలో 131 మిల్లీమీటర్ల వర్షం వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఏలూరులోని పవర్‌పేటలో రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. సర్వజన ఆస్పత్రిలోకి వర్షపు నీరు చేరడంతో ఎత్తిపోయాల్సి వచ్చింది. నూజివీడులో పెదచెరువుకు గండిపడడంతో 450 ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. నూజివీడు బస్టాండ్‌లోకి భారీగా వర్షం నీరు చేరింది. నూజివీడు-విస్సన్నపేట, నూజివీడు-హనుమాన్‌ జంక్షన్‌ రోడ్లు నీటమునిగాయి.

అల్లకల్లోలంగా ఉప్పాడ తీరం
కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున కెరటాలు ఎగిసి పడ్డాయి. సామర్లకోట, కాకినాడ, యు.కొత్తపల్లి, పెద్దాపురం, కోటనందూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. తాండవ రిజర్వాయర్‌లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకూ తేలికపాటి జల్లులు పడుతూనే ఉన్నాయి. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం, అమలాపురం, అయినవిల్లి, మామిడికుదురు, పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

విశాఖ పూర్ణా మార్కెట్‌లో స్తంభించిన లావాదేవీలు
భారీ వర్షాలకు విశాఖ నగరంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్‌, పూర్ణా మార్కెట్‌, దుర్గాలమ్మ గుడి, ప్రసాద్‌ గార్డెన్స్‌, చావుల మదుం, పోర్ట్‌ ప్రాంతంలోని బరోడా రోడ్డు, పాత పోస్ట్‌ ఆఫీస్‌, డాల్ఫిన్‌ జంక్షన్‌ తదితర చోట్ల వర్షపు నీరు రోడ్డుపై భారీగా నిలిచిపోయింది. నిత్యం రద్దీగా ఉండే పూర్ణా మార్కెట్‌లో సైతం ఎటువంటి వ్యాపార లావాదేవీలూ జరగలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. బీంపోలు పంచాయతీ రామచంద్రపురం గెడ్డ పొంగి ప్రవహించడంతో గిరివాసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మర్దగూడ, లక్ష్మీపురం మధ్య ఉన్న గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. అనకాపల్లి జిల్లాలోనూ వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో పలుచోట్ల డ్రెయిన్లు పొంగి ప్రవహించాయి. పలు కాలనీల్లోకి నీళ్లు చేరాయి. కర్నూలు రోడ్డు పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. బాపట్ల జిల్లా రేపల్లె, నగరం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వరి పైరు నీటి మునిగింది. వర్షాలకు డ్రెయిన్లు ఎగదన్నుతుండడంతో వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక చేలల్లో నీరు నిలిచిపోయింది. కర్నూలు నగరంలో వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించింది. గార్గేయపురం, కేతవరం రహదారి నదిని తలపించింది. కొత్తపల్లి మండలం శివపురం, లింగాపురం వాగు పొంగి పారడంతో 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. శ్రీశైలంలో రోడ్లు కాలువలను తలపించాయి. మహానంది మండలంలో అరటి తోటలు నీట మునిగాయి. నంద్యాల జిల్లా చాగలమర్రి, పాములపాడు మండలాల్లో ఎడతెరఫి లేని వర్షానికి మూడు మట్టి మిద్దెలు కూలాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. పోలాకి మండలంలో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయి. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య , తిరుపతి, చిత్తూరు జిలాల్లో చిరు జల్లులు పడ్డాయి.

➡️