తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం

May 16,2024 14:45 #rainfall, #Telangana

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు వుంటాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. కొద్ది సేపటి నుంచి కురుస్తున్న వానకు నగరమంతటా చలి వాతావరణం నెలకొంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కర్మన్‌ఘాట్‌, చంపాపేట్‌, ఎల్‌బీనగర్‌, నాగోల్‌లో వర్షం కురుస్తోంది. ఈ ప్రాంతాలతో పాటు.. దిల్‌ సుఖ్‌ నగర్‌, చైతన్యపురి, సైదాబాద్‌, సంతోష్‌ నగర్‌, మలక్‌ పేట పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం మరికొద్ది సేపట్లో నగరం అంతటా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భాగ్యనగరంలోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు గంటల్లో ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నేడు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వరంగల్‌, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కొన్ని చోట్ల ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో వరుణ గండాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు పశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో తుపాను ఏర్పడిందని వాతావరణ కేంద్రం తన ప్రకటనలో స్పష్టం చేసింది.

➡️