రేపు 93 మండలాల్లో వడగాడ్పులు

Apr 7,2024 23:50 #93 mandals, #Heatwave

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8న 93 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ పేర్కొన్నారు. 9న 27 మండలాల్లో వడగాడ్పులు, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 8న వడగాడ్పులు వీచే అవకాశం ఉన్న మండలాల్లో శ్రీకాకుళం జిల్లాలో 6, విజయనగరంలో 20, పార్వతీపురం మన్యంలో 8, అల్లూరి సీతారామరాజు 8, అనకాపల్లి 11, కాకినాడ 6, కోనసీమ 4, ఏలూరు 4, ఎన్‌టిఆర్‌ 2, గుంటూరు 7, పల్నాడు 2, తూర్పుగోదావరిలో 15 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8 డిగ్రీల సెల్సియస్‌, వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేట, సింహాద్రిపురంలో 45.6 డిగ్రీలు, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరులో 45.5, కర్నూలు జిల్లా ఆలూరు, ప్రకాశం జిల్లా బట్లగూడూరులో 45.4, పల్నాడు జిల్లా విజయపురిలో 45.2 అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. 107 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 235 మండలాల్లో వడగాడ్పులు వీచాయని తెలిపారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీ హైడ్రేట్‌ కాకుండా ఉండటానికి ఒఆర్‌ఎస్‌, లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని కూర్మనాథ్‌ సూచించారు.

➡️