5 రోజులపాటు వర్షాలు : వాతావరణశాఖ

Jun 10,2024 08:15 #andrapradesh, #heavy rains

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రానున్న ఐదు రోజులపాటు పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అలాగే రానున్న రెండు రోజులు దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గడ్‌, దక్షిణ ఒడిశాతోపాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డి తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో తూర్పు మధ్య భారతదేశం, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాం, త్రిపుర, బెంగాల్‌, సిక్కింలలో ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో కేరళలోని పతనంతిట్ట, కోజికోడ్‌, వాయనాడ్‌, కన్నూర్‌, కాసరగోడ్‌లకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ అయింది. తిరువనంతపురం, కొల్లామ్‌, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్‌, మలప్పురం సహా రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ ప్రకటించారు.

➡️