తెలంగాణలో నాలుగురోజుల పాటు వర్షాలు : వాతావరణ శాఖ

తెలంగాణ: హైదరాబాద్‌ నగరమంతటా మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. నైరుతి గాలుల విస్తరణతో తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. కాగా.. అత్యవసర సమయాల్లో 040-21111111, 9001136675 నంబర్లకు ఫోన్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నిర్మల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నారాయణపేట జిల్లాల్లో 10, 11 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు తెలంగాణ, కోస్తాంధ్రలోని మరికొన్ని ప్రాంతాల్లోకి గురువారం ప్రవేశించిన విషయం తెలిసిందే. రానున్న మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణతో పాటు మిగిలిన కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది.

➡️