Rains in AP – రాగల వారం రోజులపాటు ఎపిలో వానలు

Apr 11,2025 15:07 #Rains in AP for the next week

విశాఖ : ఎపిలో ఎండలు మండిపోతున్న వేళ … విశాఖ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాజస్థాన్‌-కోస్తాంధ్ర మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. హిమాలయ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాగల వారం రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, గురువారం కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లా కురిచేడు, మర్రిపూడి, గిద్దలూరు, పామూ­రు, దర్శి, పొదిలి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దర్శి మండలం చందలూరు, వెంకటచలంపల్లి, మారెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, అబ్బాయిపాలెం, మల్లవరం, చిదంబరంపల్లి, గొల్లపల్లి, కుంచేపల్లి పాములపాడు గ్రామాల్లో బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. తిరుపతి రూరల్‌, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది.

➡️