Rains – తెలంగాణలో మరో 2 రోజులపాటు వర్షాలు

Oct 2,2024 12:14 #2 days, #rains, #Telangana

తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. గత రెండు రోజులుగా తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న హైదరాబాద్‌ వాసులకు మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. నగరంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ద్రోణి తరహా వాతావరణం ఉందని దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. భారీ వర్షాలు లేకపోయినా.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. నిన్న హైదరాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలలో భారీ వర్షం కురిసింది. నిన్న కామారెడ్డిలో అత్యధికంగా 97.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పాటిగడ్డలో 40 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. నేడు రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఎల్లో అలెర్ట్‌ జారీచేసింది. కాగా, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్‌కు తాగునీటిని అందించే ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి.

➡️