రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

May 14,2024 10:03 #next 4 days, #rains, #State

అమరావతి : ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశిస్తాయని, రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని, ఈనెల 19 నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని సోమవారం వాతావరణశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

దక్షిణ కర్నాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్‌ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం వడగాల్పుల ప్రభావం ఉండబోదని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేసింది. ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీసత్యసాయి, బాపట్ల, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నంద్యాల, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో 79 మి.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

➡️