RAINS – ఈసారి వానలే వానలు …!

Apr 16,2025 11:27 #IMD, #rains

అమరావతి : ఈసారి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా వానలు సమృద్ధిగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. భూవిజ్ఞాన శాస్త్ర శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్‌, ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర మీడియాతో మాట్లాడుతూ … 1971 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా చూస్తే …. దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగటున 87 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని, ఇప్పుడు అందులో 105 శాతం వరకు వానలు కురుస్తాయని తెలిపారు. సాధారణానికి మించి, అధిక వర్షపాత అంచనాలు కలిపి చూస్తే మంచి వర్షాలకు 56 శాతం అవకాశం ఉందని వివరించారు. ఈ ఏడాది ఎల్‌నినో ఏర్పడే పరిస్థితులు లేవని చెప్పారు. జూన్‌-సెప్టెంబరు మధ్య ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో సాధారణానికి మించి వర్షాలు కురవొచ్చని అన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలంతా ఎండ దంచికొడుతుంటే…. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మబ్బు కమ్ముతోంది.. ఉన్నట్టుండి గాలిదుమారం రేగుతోంది. కాసేపట్లోనే వాన కురుస్తోంది. ప్రస్తుతం విదర్భ, మరఠ్వాడా, కర్నాటక మీదుగా ద్రోణి కొనసాగుతున్నదని, దాని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

➡️