అమరావతి : ఎగువ రాష్ట్రం కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 10 గేట్లను పది అడుగుల మేర మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అనంతరం ఆ నీరంతా నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 2,86,434 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 3,48,235 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగుల వద్ద కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 214.36 టీఎంసీల వద్ద ఉంది. శ్రీశైలం డ్యాం నుంచి వస్తున్న నీటితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. దీంతో అధికారులు 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
