బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా ర్యాలీ

ప్రజాశక్తి – నక్కపల్లి (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్‌డ్రగ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తూ శనివారం మత్స్యకారులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీనుద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ విదేశాలలో నిషేధించబడి, అదేవిధంగా కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి, తొండంగి ప్రాంతంలోని ప్రజలు వ్యతిరేకించినటువంటి బల్క్‌డ్రగ్‌ పార్కును ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి, మత్స్యకారుల ఉపాధికి నష్టం కలిగించే అత్యంత ప్రమాదకరమైన బల్క్‌డ్రగ్‌ పార్క్‌ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ఇప్పటికే హెటిరో డ్రగ్స్‌ మందుల కంపెనీ వ్యర్థ రసాయన జలాలను సముద్రంలోకి వదలడం వల్ల మత్స్య సంపద నశించిపోయిందని తెలిపారు. మత్స్యకారులు ఉపాధి కోల్పోయి వలసలు పోతున్నారన్నారు. స్థానికంగా ఉన్నవారంతా కేన్సర్‌, ఊపిరితిత్తులు, చర్మవ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. కార్పొరేట్‌ కంపెనీలతో చేతులు కలిపి వారి లాభాల కోసం ఇక్కడి ప్రజల జీవితాలను చిందరవందర చేయడం దారుణమన్నారు. బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుపై గ్రామ సభలు ఏర్పాటు చేయకుండా, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండా ముందుకెళ్లడం దుర్మార్గమన్నారు. మత్స్యకారులకు నష్టం కలిగించే చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. రాజయ్యపేటలో ఫిషింగ్‌ జెట్టీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం.రాజేష్‌, ఎం.మహేష్‌ బాబు, విద్యా కమిటీ చైర్మన్‌ కోడా కాశీరావు, మాజీ ఎంపిటిసి సభ్యులు పి.తాతీలు, జనసేన నాయకులు పి.స్వామి, మత్స్యకార నాయకులు జి.సోమేశ్వరరావు, బి.నూకరాజు, బి.అప్పలరాజు, ఎం.నరేష్‌, జి.అంజి, సిహెచ్‌.తాతాజీ పాల్గొన్నారు.

➡️