ప్రజాశక్తి-పాలకొల్లు :పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు కానున్న డయాలసిస్ సెంటర్ వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన ఆదివారం డయాలసిస్ సెంటర్ పనులు, రూ 12.60 కోట్లతో జరుగుతున్న కొత్త భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పనులకు సంబంధించి సంబంధిత శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డయాలసిస్ సెంటర్‌కి సంబంధించి 90 శాతం పనులు జరిగాయని మరో 3 రోజుల్లో మిగిలిన 10 శాతం పనులు పూర్తి అవుతాయని తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన డయాలసిస్ రోగులు అర్ధరాత్రి సైతం భీమవరం, ఏలూరు, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, అమలాపురం వంటి ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని దీంతో ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారని మంత్రి తెలిపారు. దీన్ని దష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ఇచ్చిన హామీని నెరవేర్చానన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంజూరైన 2 డయాలసిస్ సెంటర్లో ఒకటి పాలకొల్లు అని తెలిపారు. గత టిడిపి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో 50 పడక ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచి కొత్త భవన నిర్మాణాలకు రూ 12.60 కోట్లు తీసుకు వచ్చానని తెలిపారు. సంవత్సరంన్నర లో పూర్తి కావలసిన ఈ పనులు దురదష్టవశాత్తు ప్రభుత్వం మారడంతో ఐదేళ్లయిన పూర్తి కాకపోగా జరిగిన పనులు నాణ్యత ప్రమాణాలతో నోచుకోలేదని , వర్షం వస్తే బీటలు తీసిన ప్రాంతాల్లో నీరు లీకేజ్ అవుతుందని మొత్తంగా విద్వాంసానికి గురైందని మంత్రి చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఈ పనులను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కొత్త భవనం నిర్మాణం ను సుందర వనంగా తీర్చిదిద్దేలా ప్రత్యేక దష్టి సారించినట్లు మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాఖపరమైన ఇంజనీరింగ్ అధికారులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డా వర్మ, నాయకులు గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి బాబు, మహమ్మద్ జానీ, మామిడి శెట్టి పెద్దిరాజు, ధనాన్ని సూర్య ప్రకాష్, వట్టం గణేష్, మల్లంపల్లి పకీర్ బాబు, చినిమిల్లి గణపతి, తదితరులు పాల్గొన్నారు.
