ఒక ఘటనపై వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు చెల్లవు : ఆర్‌జివి

ప్రజాశక్తి-అమరావతి : సోషల్‌ మీడియా పోస్టులపై పలు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడాన్ని సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సవాల్‌ చేసిన కేసులో పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. కౌంటర్‌ వేయాల ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 2కు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి గురువారం ప్రకటించారు. . ప్రకాశంజిల్లా, మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన వాటిని మూసేయాలని పిటిషనర్‌ న్యాయవాది కోరారు.

ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు

కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మరొకరు తనపై అత్యాచారం చేశారంటూ విజయవాడకు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తాను చేసిన ఫిర్యాదు వాస్తవం కాదని కోర్టుకు వచ్చి ఆమె నేరుగా చెప్పారు. దీంతో, ఫిర్యాదుదారు అఫిడవిట్‌ దాఖలుకు అనుగుణంగా ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలని మేజిస్ట్రేట్‌ ముందు పిటిషన్‌ వేసినట్లు హైకోర్టుకు పోలీసులు తెలిపారు. ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేశాక కేసు విషయంలోఏం చేయాలో నిర్ణయిస్తామని అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాయి రోహిత్‌.. హైకోర్టుకు నివేదించారు. ఇందుకు అనుమతించిన హైకోర్టు విచారణను డిసెంబర్‌ 11కు వాయిదా వేసింది.

ఆ మెడికల్‌ సీట్ల భర్తీకి కీలక ఆదేశాలు

ఎంబిబిఎస్‌ స్పెషల్‌ స్ట్రే వేకెన్సీ సీట్ల భర్తీ నిమిత్తం హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. అమలాపురంలోని కోనసీమ మెడికల్‌ కాలేజీ, కర్నూలులోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీతోపాటు ఆ జిల్లాలోని విశ్వభారతి కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద పెరిగిన 76 సీట్లను స్పెషల్‌ స్ట్రే వేకెన్సీ రౌండ్‌ కింద కౌన్సిలింగ్‌ నిర్వహించాలంది. ఈ మేరకు ఎన్‌టిఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆదేశించింది. కన్వీనర్‌, యాజమాన్య, ఎస్‌ఆర్‌ఎ కోటా కింద ఏ కాలేజీల్లో కూడా సీట్లు కేటాయించని అభ్యర్థులందరి నుంచి ఆప్షన్లు తీసుకుని స్పెషల్‌ స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్‌ 76 సీట్లకు నిర్వహించాలని ఆదేశించింది. వీటిని పొందిన కారణంగా ఖాళీ అయ్యే బిడిఎస్‌ కోర్సు సీట్లను భర్తీ చేసేందుకు కన్వీనర్‌ కోటా కింద తిరిగి స్పెషల్‌ స్ప్రే వేకెన్సీ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించా లంది. ప్రతిభ ఆధారంగానే సీట్ల భర్తీ చేయాలంది. ఎంబిబిఎస్‌ తరువాత బిడిఎస్‌ సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. పెరిగిన 76 సీట్ల భర్తీ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లేకుండా ర్యాంకుల ఆధారంగా తమ తర్వాత ఉన్న అభ్యర్థులతో స్పెషల్‌ స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్‌ చేయాలనే నిర్ణయాన్ని నలుగురు విద్యార్థులు సవాల్‌ చేసిన కేసులో హైకోర్టు పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యాసాగర్‌ పిటిషన్‌

సినీనటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు ఆధారంగా పెట్టిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ వ్యాపారవేత్త విద్యాసాగర్‌ వేసిన పిటిషన్‌లో కౌంటర్‌ వేయాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. జత్వాని కూడా కౌంటర్‌ వేయాలంది. విచారణను డిసెంబరు 3కు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ విఆర్‌కె కృపాసాగర్‌ ప్రకటించారు.

➡️