రామోజీరావు ఇకలేరు

  • రాష్ట్రపతి, ప్రధాని ప్రభృతుల సంతాపం
  • నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
  • రాష్ట్రంలో రెండు రోజులు సంతాప దినాలు

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ఈనాడు గ్రూప్‌ సంస్థల అధిపతి, ప్రముఖ వ్యాపారవేత్త, పద్మ విభూషణ్‌ చెరుకూరి రామోజీరావు (87) ఇకలేరు. దశాబ్దాలుగా తెలుగుప్రజలతో అనేకరకాలుగా మమేకమైన ఆయన శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి రాష్ట్రపతి, ప్రధాని ప్రభృతులు సంతాపం ప్రకటించారు.. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటిలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలియజేశారు. అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రామోజీ మృతికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. రామోజీరావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం శ్వాసతీసుకోవడం కష్టం కావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య రమాదేవి, పెద్ద కుమారుడు కిరణ్‌ ఉన్నారు. చిన్న కుమారుడు సుమన్‌ 2012లో కేన్సర్‌తో చనిపోయారు.. పెద్ద కుమారుడు కిరణ్‌ ఈనాడు గ్రూప్‌ సంస్థల చైర్మన్‌.ఈటీవి అధిపతిగా ఉన్నారు.
రామోజీ మరణ వార్త తెలియగానే టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఢిల్లీ నుండి హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసిరామోజీ ఫిల్మ్‌ సిటీకి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సిజెఐ జస్టిస్‌ ఎన్‌వి రమణ, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, మాజీ ఎంపి పి. మధు తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
రామోజీరావు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున అధికార ప్రతినిధు లుగా సీనియర్‌ అధికారులు ఆర్‌పి సిసోడియా, సాయిప్రసాద్‌, రజత్‌ భార్గవ్‌ హాజరుకానున్నారు.

➡️