అక్షర యోధునికి అంతిమ వీడ్కోలు

Jun 10,2024 08:19 #funeral is over, #Ramoji Rao
  • ఫిల్మ్‌ సిటీలో ఆయన నిర్మించుకున్న స్మారక కట్టడం వద్ద అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
  • పాడె మోసిన చంద్రబాబు

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆదివారం ముగిశాయి. రామోజీ ఫిల్మ్‌ సిటీలోని విశాలమైన ప్రాంతంలో రామోజీరావు స్వయంగా నిర్మాణం చేయించుకున్న స్మృతి కట్టడం వద్ద కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానుల ‘జోహార్‌ రామోజీరావు’ నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌ సిటీలోని నివాసం నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పోలీస్‌ బ్యాండ్‌ నడుమ రామోజీరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి రామోజీ గ్రూప్‌ సంస్థల కార్యాలయాల మీదుగా స్మారక కట్టడానికి చేరుకుంది. ‘జోహార్‌ రామోజీ’ అంటూ తుది వీడ్కోలు పలికారు. రామోజీ సంస్థల సిబ్బంది, అభిమానులు, పలు రంగాల ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతిమయాత్ర స్మృతి కట్టడం వద్దకు చేరుకున్న తర్వాత రామోజీ భౌతికకాయాన్ని కుటుంట సభ్యులు వాహనం నుంచి కిందకు దింపారు. కుటుంబ సంప్రదాయ క్రతువులు నిర్వహించిన అనంతరం చంద్రబాబు, లోకేశ్‌, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, మాజీ సిజెఐ జస్టిస్‌ ఎన్‌వి రమణ, పలువురు సినీ ప్రముఖులు రామోజీరావుకు కడసారిగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి రామోజీరావు పాడెను చంద్రబాబు మోశారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అంతిమ సంస్కారాల అనంతరం రామోజీ రావు చితికి ఆయన కుమారుడు, ఈనాడు ఎండి సిహెచ్‌.కిరణ్‌ నిప్పంటించారు. చంద్రబాబు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

➡️