- నిందితుడు అరెస్టు
ప్రజాశక్తి -తగరపువలస (విశాఖపట్నం) : తప్ప తాగిన ఓ కసాయి తండ్రి ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన విశాఖ జిల్లా తగరపువలస పాత కృష్ణా కళాశాల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. భీమిలి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన భార్యభర్తలు ఉపాధి కోసం కొద్ది కాలం క్రితం విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రాంతానికి వచ్చారు. ఇద్దరూ కూలి పనులు చేస్తూ బతుకుతున్నారు. వారికి ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన అప్పన్న తరచూ భార్యతో గొడవలు పడుతుండేవాడు. ఈ క్రమంలో కుమార్తె, కుమారుడును వెంట తీసుకుని మంగళవారం రాత్రి తగరపువలస వచ్చాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి వేళ జనసంచారం లేని కిరణా దుకాణం బయట కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక కేకలు విన్న ఓ లారీ డ్రైవర్ చుట్టు పక్కల ఉన్న వారిని పిలిచి నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రక్తస్రావంతో ఉన్న బాలికను వైద్య పరీక్షలు నిమిత్తం కెజిహెచ్‌కు పోలీసులు తీసుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని నార్త్ సబ్ డివిజన్ ఎసిపి అప్పలరాజు, సిఐ బి తిరుమలరావు పరిశీలించారు. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సిఐ తిరుమలరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.