‘అపోలో’లో అరుదైన శస్త్ర చికిత్స

Jun 11,2024 21:35 #'Apollo', #A rare surgery

ప్రజాశక్తి-నెల్లూరు:నెల్లూరు అపోలో ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. ఓ వృద్ధుడికి మూసుకుపోయిన కవాటాన్ని ఆపరేషన్‌ ద్వారా తిరిగి యథాస్థితికి తీసుకువచ్చారు. చికిత్స విధానాన్ని ఆస్పత్రి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ శ్రీరామ్‌ సతీష్‌, ప్రముఖ కార్డియాలాజిస్ట్‌ డాక్టర్‌ చిర్రా భక్తవత్సల రెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన నాగేశ్వరరావు (70) గత కొంతకాలంగా ఆయాసం, దగ్గు, ఛాతి నొప్పితో బాధపడుతున్నారు. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో అపోలో ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలు చేయగా ఆక్సిజన్‌ పల్స్‌ శాతం 80, హార్ట్‌ రేట్‌ 130, కిడ్నీ ఫంక్షన్‌ 2.3గా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ప్రముఖ కార్డియాలజిస్టు చిర్రా భక్తవత్సలరెడ్డి సూచనల మేరకు పూర్తి స్థాయిలో పరీక్షించగా అతని గుండె కవాటం మూసుకుపోయి ఉండడాన్ని గుర్తించారు. గుండెకు రక్తం సరఫరా చేసే కవాటం వాస్తవానికి ఏడు సెంటీమీటర్లు ఉండాల్సి ఉండగా ఐదు సెంటీమీటర్లు కుంచుకుపోయినట్లు నిర్ధారించారు. ప్రాణాపాయంతో కూడిన ఆపరేషన్‌ కావడంతో కుటుంబ సభ్యుల అనుమతితో బాధితుడికి ఆపరేషన్‌ చేశారు. బాధితుడి గుండెను పేస్‌మేకర్‌ ద్వారా నాలుగు సెకండ్లపాటు నిలిపివేసి, కాలు నరం ద్వారా వాల్వ్‌ను పంపి కవాటాన్ని తిరిగి యథాస్థితికి తీసుకువచ్చారు. నెల్లూరు అపోలో ఆస్పత్రిలో ఇటువంటి ఆపరేషన్‌ రెండవదని, మొట్టమొదటిసారి కావలికి చెందిన ఓ వ్యక్తికి మూడేళ్ల క్రితం ఇటువంటి ఆపరేషన్‌ నిర్వహించామని వైద్యులు తెలిపారు.

➡️