రతన్‌ టాటా గొప్ప విజనరీ : మంత్రి నారా లోకేష్‌

ప్రజాశక్తి – కాళ (పశ్చిమ గోదావరి జిల్లా) : దేశాభివృద్ధిలో రతన్‌టాటా కీలకపాత్ర వహించారని రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదఅమిరంలో సోమవారం రతన్‌ టాటా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రతన్‌టాటా మార్గ్‌గా నామకరణం చేసిన భీమవరం-ఉండి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ ఒక వ్యాపార వేత్తగా కంట్రీ ఫస్ట్‌ అనే నినాదానికి కట్టుబడి చివరి వరకు పనిచేసిన ఘనత రతన్‌ టాటాకే దక్కుతుందన్నారు. భారతీయ కంపెనీల సమర్థతను ప్రపంచానికి చాటిన గొప్ప పారిశ్రామికవేత్త అని, గొప్ప విజనరీ అని కొనియాడారు. బసవతారకం కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు 1992లో రతన్‌టాటా రూ.25 కోట్లు విరాళం ఇచ్చారని, 2014 హుదూహుద్‌ తుపాను సమయంలో టాటా ట్రస్ట్‌ సిఇఒకు తాను ఫోన్‌ చేస్తే 30 సెకన్లలో రూ.మూడు కోట్లు సమకూర్చారని గుర్తుచేశారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్రంలో ప్రజా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేసి యువతకు మెరుగైన నెట్‌వర్కింగ్‌ అందించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు చేరుకున్న మంత్రి లోకేష్‌ వర్చువల్‌ విధానంలో పెదఅమిరంలో ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యం రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన ఫిల్టర్‌బెడ్‌ను ప్రారంభించారు. లోకేష్‌ను ఆ కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. దీనికి ముందు మండల కేంద్రమైన ఉండిలో పున:నిర్మించిన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లోని తరగతి గదుల భవనాలను, క్రీడా ప్రాంగణాన్ని లోకేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు అడిగిన దానిపై స్పందించి హైస్కూల్‌ ప్లస్‌ విధానాన్ని అభివృద్ధి చేసే దిశగా వెళ్తున్నామని, అంతేతప్ప హైస్కూల్‌ ప్లస్‌ విధానాన్ని రద్దు చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైౖర్మన్‌ పులపర్తి రామాంజనేయులు, రాష్ట్ర ఎపిఐఐసి చైౖర్మన్‌ మంతెన రామరాజు, ఎపి ఎస్‌సిపిసి చైర్‌పర్సన్‌ పీతల సుజాత, జిల్లా కలెక్టర్‌ సి నాగరాణి, ఎస్‌పి అద్నాన్‌ నయీం అస్మి, జడ్‌పి చైౖర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

➡️