అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ప్రారంభం

  • ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ : శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న ఈ వేడుకలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. తొలిరోజు ఆదివారం ఉదయం నగరంలోని 80 అడుగుల రోడ్డులో సామూహిక సూర్య నమస్కారాలతో ప్రారంభమైన వేడుకలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తదితరులు హాజరయ్యారు. సుమారు ఐదు వేల మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. డచ్‌ బిల్డింగ్‌ వద్ద టూరిజం హెలీకాప్టర్‌ రైడ్‌, ఎన్‌టిఆర్‌ మున్సిపల్‌ మైదానంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్‌, జిల్లా స్థాయి వెయిట్‌లిప్టింగ్‌, గ్రామీణ క్రీడలైన కర్రసాము, సంగిడీలు, ఉలవల బస్తా లిఫ్టింగ్‌ తదితర క్రీడా పోటీలను కేంద్ర మంత్రి ప్రారంభించారు. మధ్యాహ్నం డేఅండ్‌నైట్‌ కూడలి నుంచి అరసవల్లి ఆలయం వరకు నిర్వహించిన శోభాయాత్రను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, పలు ఆలయాల ప్రచార రథాలు, మంగళ వాయిద్యాలతో శోభాయాత్ర సాగింది. రథసప్తమి వేడుకల్లో భాగంగా ‘సమగ్రత-సమానత్వం’ అంశంపై విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో సంగీత కార్యక్రమాలు, హైపర్‌ ఆది, ఫైమా, ఢ భూమిక, రేలారే రేలా టీమ్‌, మిమిక్రీ ఆనంద్‌, జోష్‌ శివ, పిన్ని సాంగ్‌ ఫేమ్‌ షణ్ముఖ, సురేష్‌, రేష్మ, బాలాజీ వంటి ప్రముఖులు ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ అంజనా కళా సంస్థ ఆధ్వర్యాన పంచరత్నాలు పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు.

➡️