తిరుపతి : నేడు రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని …. తిరుమలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్య దేశాలయానికి యాత్రికులు పోటెత్తారు. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు. సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో వేంకటేశ్వరుడిని ఊరేగించారు. వేంకటేశ్వరుడిని చూడటానికి భారీగా జనాలు తరలిరావడంతో తిరుమలలో రద్దీ నెలకొంది. వాహనసేవలను చూడటానికి వచ్చే ప్రజలను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలలో వేచి ఉండే వారు ఇబ్బందులు పడకుండా తిరు వీధుల్లోని గ్యాలరీల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. గ్యాలరీల్లో నిరంతరాయంగా జనాలకు అన్నపానీయాల సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్యాలరీల్లోకి చేరుకోలేనివారు.. వాహనసేవలను చూడటానికి తిరుమాడ వీధులకు బయట అధికారులు ఎల్‌ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. తిరుమలలో సూర్య కిరణాలు తాకిన వెంటనే వాహన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్య ప్రభ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ మలయప్పస్వామి యాత్రికులకు దర్శనం ఇస్తున్నారు. అనంతరం 9 గంటల నుంచి 10 గంటల వరకు గోవిందుడు.. చిన్న శేష వాహనంపై ఊరేగుతారు. 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనంపై తిరు వీధుల్లో కోనేటిరాయుడు ఊరేగుతారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు శ్రీనివాసుడు హనుమంత వాహనంపై దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు శ్రీవారి వరాహ పుష్కరిణిలో చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. రాత్రి జరిగే చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగియనున్నాయి.
అరసవల్లిలో..
శ్రీకాకుళం జిల్లా అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనమివ్వనున్నారు. సూర్యనారాయణుడి దర్శనం కోసం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాగా, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినరు చంద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.