- అశేషంగా తరలివచ్చిన యాత్రికులు
ప్రజాశక్తి- తిరుమల / శ్రీకాకుళం ప్రతినిధి : ఆదిత్యుని జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా తిరుమలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయానికి యాత్రికులు పోటెత్తారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రారంభమైన క్షీరాభిషేక సేవ మంగళవారం ఉదయం వరకు సాగింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వినరుచంద్.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రథసప్తమి వేడుకలను వీక్షించేందుకు అర్ధరాత్రి నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు తెలంగాణ, ఒడిశా నుంచి వేల సంఖ్యలో యాత్రికులు చేరుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, ఎస్‌పి కె.వి మహేశ్వరరెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
తిరుమలలో సప్త వాహనాలపై శ్రీవారిని ఊరేగించారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే యాత్రికులను దృష్టిలో ఉంచుకొని టిటిడి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలలో వేచి ఉండే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా తిరు వీధుల్లోని గ్యాలరీల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. వాహన సేవలను తిలకించేందుకు తిరుమాఢ వీధులకు వెలుపల అధికారులు భారీ ఎల్‌ఇడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. రెండు వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.