సమస్యలు పరిష్కరించిన తర్వాతే రేషనలైజేషన్‌ ప్రక్రియ

ఎపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య వినతి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన అనంతరమే రేషనలైజేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలని ఎపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. సంక్షేమ సమాఖ్య గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ కె.అనూరాధ, డాక్టర్‌ ఎం.గురుస్వామి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌ ప్రక్రియలో ఒక అడుగు ముందుకు వేసిన ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారంలో కూడా ఒక అడుగు ముందుకు వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించినప్పటికీ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా రేషనలైజేషన్‌ పేరుతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వారి మాతృశాఖ ఏదో తెలియజేసి ఆయా శాఖలకు అప్పజెప్పి, నిర్ధిష్ట ప్రమోషన్‌ ఛానెల్‌ ప్రకటించాలన్నారు. అంతేకాకుండా అర్హులైన వారికి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని ఎపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గ్రామ, వార్డు సచివాలయంలో ఒకేజాబ్‌ చార్ట్‌ కలిగి పనిచేసే వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీలను సాంఘిక సంక్షేమ, ఇరత సంక్షేమశాఖలకు తక్షణమే బదిలీ చేయాలన్నారు. సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులను వారి సొంత జిల్లాలకు వెంటనే బదిలీ చేయాలని, రేషనలైజేషన్‌ చేయడం ద్వారా ఉద్యోగులు మిగిలిపోతారనే ఉద్ధేశ్యంతో కొంత మంది ఉద్యోగులను ఓడి పేర్లతో ఇతర శాఖల్లో పని చేయించుకుంటున్నారని అలా ఓడిపై కాకుండా వారు పనిచేసే శాఖలకు పూర్తిగా అప్పజెప్పాలన్నారు. అదే విధంగా రోజు రోజుకు పెరుగుతున్న సర్వేల భారాన్ని తగ్గించి సర్వేల పట్ల ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ, ప్రజలకు అవగాహన కలిగించాలని సమాఖ్య నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

➡️