రీ – పోలింగ్‌ పెట్టండి

  • ఇసిని కోరిన టిడిపి, వైసిపిలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని టిడిపి, వైసిపిలు ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ా ముఖేష్‌కుమార్‌మీనాను మంగళవారం ఆయా పార్టీల ప్రతినిధులు కలిసి వినతి పత్రాలు అందజేశారు. హింస చోటుచేసుకోవడం, గాల్లోకి కాల్పులు అభ్యర్ధుల మీద దాడులు, గృహ నిర్భందాల వంటి సంఘటనలతో పాటు ఇవిఎంలు పలు చోట్ల మొరాయించాయని వినతిపత్రాల్లో ఆ పార్టీలు పేర్కొన్నాయి,.

31 చోట్ల జరపండి : టిడిపి డిమాండ్‌
రాష్ట్ర వ్యాప్తంగా 31 చోట్ల రీ పోలింగ్‌కు డిమాండ్‌ చేస్తూ టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఎన్నికల కమిషన్‌ను కోరింది. మాచర్లలో 114, 115,116,117, సత్తెనపల్లిలో 234, 235, 241, 242, 243, 244, దర్శిలో 88, 93, 97, 155, 156, ఒంగోలులో 5, 6, 57,194 ,195 పోలింగ్‌బూత్‌ల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని సిఇఓను కోరారు. వీటితో పాటు శ్రీకాళహస్తిలో 126, చిత్తూరులో 210, మదనపల్లిలో221, అనంతపురం అర్భన్‌లో 143,144,145,146,147, 255, 256, పుట్టపర్తిలో 147, 203 పోలింగ్‌బూత్‌ల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని టిడిపి ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. మాజీమంత్రి నన్నపనేని రాజకుమారి, గుంటూరు మిర్చి యార్డు మాజీఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు, టిడిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండూరి అఖిల్‌ సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనాను కలిసన వారిలో ఉన్నారు.

ఆరు చోట్ల రీపోలింగ్‌ : వైసిపి వినతి
సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఆరు బూతుల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని వైసిపి ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సిఇఓను కలిసి వినతిపత్రం అందచేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని దమ్మాలపాడులో 253, 254, నార్నెపాడులో 236,237, చీమలమర్రిలో 197,198 బూత్‌ల్లో టిడిపి రిగ్గింగ్‌ చేసిందని, ఆయా పోలింగ్‌ స్టేషన్లలోని వెబ్‌కెమెరాలను పరిశీలించి రీ పోలింగ్‌ నిర్వహించాలని సిఇఓకు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. కొత్త గణేశునిపాడులో టిడిపి దాడులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ పోలీసుల వైపల్యాలపై ఎన్నికల క మిషన్‌ సమీక్ష నిర్వహించాలని, లా అండ్‌ ఆర్డర్‌ను ఎందుకు కాపాడలేక పోయారని ఆయన ఫ్రశ్నించారు.

నేడు గవర్నర్‌ను కలవనున్న టిడిపి
రిజర్వ్‌ బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న నగదును అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఎన్నికల కోడ్‌ పూర్తయ్యే వరకు కాంట్రాక్టర్లకు నగదు చెల్లింపులు చేయకుండా నిలువరించాలని కోరుతూ బుధవారం టిడిపి ప్రతినిధుల బృందం గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ను కలిసి వినతి పత్రం ఇవ్వనుంది. ఆరోగ్యశ్రీ , ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకుండా దారిమళ్లించే కుట్ర చేస్తున్నారని టిడిపి ఆరోపించింది. ఇదే విషయంపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు మంగళవారం గవర్నర్‌కు లేఖ రాశారు.

➡️