మత్స్యకారులకిచ్చే పరిహారం, లబ్ధిదారుల జాబితాపై రీ సర్వే

  • 4 వేల వేట పడవలకు శాటిలైట్‌ సిస్టమ్‌
  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే పరిహారం, లబ్ధిదారుల జాబితాపై రీ సర్వే చేసి 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు వేట నిషేధిత సమయంలో ఇచ్చే భృతిని నిష్పక్షపాతంగా ఇవ్వలేదని, చాలాచోట్ల అనర్హులకు అందజేశారని, అర్హులకు ఇవ్వలేదని మంత్రి వ్యాఖ్యానించారు. విజయవాడ పెనమలూరులోని మత్స్యశాఖ కమిషనరు కార్యాలయంలో అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రకృతి వైఫరీత్యాల సమయంలో మత్స్యకారులను అప్రమత్తం చేయడంతోపాటు క్షేమంగా ఒడ్డుకు చేరుకునేలా వేటకు వెళ్లే పడవలకు శాటిలైట్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 20 వేల వేట పడవలు ఉండగా, వాటిలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 4 వేల పడవలకు శాటిలైట్‌ సిస్టమ్‌ను పెడుతున్నట్లు, దశలవారీ మిగిలిన పడవలకు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు డీజిల్‌ రాయితీ రూ.10 కోట్ల బకాయిలు పెట్టిందని, డీజిల్‌ సబ్సిడీ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. మత్స్యశాఖ అభివృద్ధి విషయంలో కేరళ, గుజరాత్‌ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఐదు హార్బర్లకు టెండర్లు పిలిచి సొంత వారికే కట్టబెట్టారని, పనులు ప్రారంభించేందుకు 40 శాతం నిధులు చెల్లించిందని అన్నారు. రెండోసారి నాలుగు హార్బర్లను అప్పటి ఎమ్మెల్యే, ఆయన తమ్ముడికి ఇచ్చారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ నాలుగింటిలో రెండు హార్బర్లు పనిచేయడం లేదని పేర్కొన్నారు. అలాగే బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఓడరేవు, బియ్యపు తిప్ప ఫిషింగ్‌ హార్బర్ల స్థితిగతులపైనా నివేదిక ఇవ్వాలన్నారు. 2014-19 వరకు మత్స్యశాఖ అమలు చేసిన పథకాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. విజయవాడ, కలిదిండిలోని ఆక్వాహబ్‌ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, ఆక్వాకల్చర్‌, మత్స్యశాఖ సెక్రటరీ అహ్మద్‌బాబు, మత్స్యశాఖ కమిషనరు ఎ సూర్యకుమారి, అదనపు సంచాలకులు ఎస్‌ అంజలి పాల్గొన్నారు.

➡️