‘రియల్‌’ ఇక సులభతరం

  • 15 రోజుల్లో అనుమతి
  • లే అవుట్లలో ఇక 9 మీటర్ల రోడ్లు : ఉత్తర్వులు విడుదల

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సంబంధించిన అనుమతులను పొందడాన్ని ప్రభుత్వం సులభతరం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాదుతూ బిల్డర్లు, డెవలపర్లకు అనుకూలంగా నిబంధనల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. ప్రజానీకానికి కూడా ఈ మార్పులు అనుకూలంగా ఉంటాయని అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్లతో చర్చించిన తరువాత ఈ నిర్ణయాలు తీసుకున్నామని, ఫలితంగా రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగం పుంజుకుంటుందని చెప్పారు. తాజా ఉత్తర్వుల్లో భవనాలు, లేఅవుట్ల నిర్మాణాలకు సంబంధించిన పలు నిబంధనలను మార్చారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా ఈ మేరకు మార్పులు చేసినట్లు పట్టణాభివృద్దిశాఖ కార్యదర్శి కె.కన్నబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లేఅవుట్లలో రోడ్లు కనీసం 12 మీటర్ల వెడల్పు ఉండాలని గతంలో నిబంధన ఉండగా దానిని ప్రస్తుతం 9 మీటర్లకు కుదించారు. జాతీయ, రాష్ట్ర రహదారులు వెంట నిర్మాణాలు చేపట్టే సమయంలో 12 మీటర్ల సర్వీసు రోడ్లు వదలాలనే నిబంధనను కూడా తొమ్మిదిమీటర్లకు తగ్గించారు. 500 చదరపు మీటర్ల పైబడిన స్థలాల్లో సెల్లార్ల నిర్మాణానికి అనుమతిచ్చారు. టిడిఆర్‌ బాండ్ల జారీ కమిటీలో సబ్‌ రిజిస్ట్రార్లను తొలగించారు.
అదే విధంగా సెట్‌ బ్యాక్‌ నిబంధనల్లోనూ మార్పులు చేశారు. 30 మీటర్లపైబడిన భవనాలకు ఫ్రంట్‌ సెట్‌బ్యాక్‌ను మూడు మీటర్లకు తగ్గించారు. 18 మీటర్ల నుండి 30 మీటర్ల వరకూ ఎత్తుండే భవనాలకు కూడా ఇదే నిబంధనలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొమ్మిది మీటర్ల నుండి 18 మీటర్ల వరకూ ఉన్న భవనాలకు రెండు మీటర్ల ఫ్రంట్‌ సెట్‌బ్యాక్‌ సరిపోతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లైసెన్స్‌డు ఇంజనీరు నేరుగా దరఖాస్తు చేసుకునే విధంగా, దరఖాస్తు చేసిన 15 రోజుల్లో అన్ని అనుమతులూ వచ్చే విధంగా సింగిల్‌ విండో విధానం ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఎపి బిల్డింగ్‌ రూల్స్‌ 2017, ఎపి ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ రూల్స్‌ 2017లో సవరణలు చేస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.

➡️