పని భారం తగ్గించండి

  • వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తీసుకోండి
  • ధర్నాలో గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీల డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : ‘ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తీసుకు రావాలి. పనిభారం తగ్గించాలి. బదిలీ సౌకర్యం కల్పించాలి. ఎంపిహెచ్‌ఏ(ఎఫ్‌)గా ప్రమోషన్లు కల్పించాలి.’ అంటూ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీలు డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ యునైటెడ్‌ విలేజ్‌ అండ్‌ వార్డు హెల్త్‌ సెక్రటరీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (యుహెచ్‌ఎస్‌ఎ) ఆధ్యర్యంలో గురువారం విజయవాడ ధర్నా చౌక్‌లో సమస్యల పరిష్కారం కోసం వారు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగాచేసిన నినాదాలతో విజయవాడ థర్నా చౌక్‌ మారుమ్రోగింది. ఈ సందర్బంగా యుహెచ్‌ఎస్‌ఎ గౌరవాధ్యక్షులు కె.జగన్మోహనరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆ సంఘ గౌరవ సలహాదారు ఎ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ వర్కుర్లు వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌శాఖల మధ్యలో అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్‌ సెక్రటరీలు రోజుకు 12 గంటలకుపైగా పనిచేయాల్సి వస్తోందని, ఎనిమిది గంటల పని విధానం అమలు కావడం లేదన్నారు. వారిని డిపార్టుమెంట్‌ పనులకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్‌ చేశారు. జాబ్‌ చార్టు ప్రకారమే పనులు చేయించాలని అన్నారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులకు పలు పర్యాయాలు వినతులు చేసినా స్పందన లేకపోవడంతోనే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పటికి సమస్య పరిష్కరింకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యుహెచ్‌ఎస్‌ఎ రాష్ట్ర అధ్యక్షులు ఎ.మాధవి, కార్యనిర్వహక అధ్యక్షులు కె.అన్నయ్య, ప్రధాన కార్యదర్శి జి.సంధ్యారాణి, సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.సి.హెచ్‌ శ్రీనివాస్‌ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. ఎపి అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శివారెడ్డి, కె. విద్యాసాగర్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్ప్‌ర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి తదితరులు సంఘీభావం తెలిపారు. హెల్త్‌ సెక్రెటరీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

➡️