ఆర్‌టిసిలో సంస్కరణలు

  • లాభాల బాటలో నడిపిస్తాం
  • నూతనంగా 1400 సర్వీసులు : మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అవసరమైన మేరకు సంస్కరణలు తీసుకొస్తామని, లాభాల బాటలో నడిపిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం సిటీ బస్టాండ్‌ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.1.20 కోట్లతో ఇటీవల కొనుగోలు చేసిన మూడు ఆర్‌టిసి సూపర్‌ లగ్జరీ అంతర్‌ జిల్లాల సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. అదే ప్రాంగణంలో మొక్కను నాటారు. అనంతరం ఆదర్శ ఉద్యోగుల అభినందన సభకు వచ్చే ఉద్యోగులను సత్కరించారు. డ్రైవర్లు, కండక్టర్లు, విజిలెన్స్‌, సెక్యూరిటీ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన 20 మందికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల శ్రమ, కృషితో ఆర్‌టిసి సంస్థ ఎంతో ప్రగతి సాధించిందని, ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూ వచ్చిందని చెప్పారు. సంస్థ గుర్తింపును కాపాడుతూ సంస్కరణలు తీసుకొస్తామని, ఆధునిక సేవలందిస్తామని అన్నారు. కార్మికులకు వైద్య బీమా కల్పిస్తామని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. అతి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. లాభాలు ఆర్జించేలా కార్గో, కొరియర్‌ సేవలను విస్తృతం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 1400 నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఆర్‌టిసి రీజినల్‌ మేనేజర్‌ అప్పలరాజు, కార్మికులు పాల్గొన్నారు.

➡️