నేటి నుంచి గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రాడ్యుయేట్‌ ఎన్నికల ఓటర్ల నమోదు కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఓటర్ల నమోదు ప్రక్రియ నవంబరు 6 వరకు జరగనుంది. మార్చిలో కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్‌, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు జరగునున్నాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న కెఎస్‌ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు పదవీకాలం మార్చితో పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఫారం-18 ద్వారా తమ ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఎన్నికలు జరిగే జిల్లాల పరిధిలో నివసించే వారు (ఆధార్‌లో ఉన్న అడ్రస్‌ ప్రకారం) వారందరూ గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారైనా ఆధార్‌ అడ్రస్‌ స్థానికంగా ఉంటే ఆ యువత గ్రాడ్యుయేట్‌ ఎక్కడ పూర్తి చేసినా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో ఫారం-18 ద్వారా ఓటు రిజిస్టర్‌ చేసుకున్నవారు, అధికారులు వెరిఫికేషన్‌కు అధికారులు దరఖాస్తుదారుల ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఒరిజనల్‌ సర్టిఫికెట్స్‌ చూపించాల్సి ఉంటుంది. ఓటు హక్కు నమోదు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ, గ్రాడ్యుయేషన్‌ ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ జెరాక్స్‌ కాపీ, ఆధార్‌ జెరాక్స్‌ కాపీ, ఓటర్‌ ఐడి జెరాక్స్‌్‌, పాస్‌పోర్ట్‌ ఫొటో, మొబైల్‌ నెంబర్‌ జతచేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఓటు నమోదు చేయించుకున్న ఓటరు రసీదు జాగ్రత్త పరుచుకోవాల్సి ఉంటుంది. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల్లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ ఓటును నమోదు చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌డి జాని పాషా విజ్ఞప్తి చేశారు.

➡️