ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల ద్వారా ప్రజలకు మరింత స్నేహ పూర్వక వాతావరణంలో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించడమే తమ ధ్యేయమని రెవెన్యూ స్పెషల్ సిఎస్ ఆర్ పి సిసోడియా పేర్కొన్నారు. విజయవాడ గుణదల రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ సబ్ రిజిస్టార్ ఆఫీస్‌లో సోమవారం సబ్ రిజిస్టార్ పోడియం తొలగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిసోడియా మీడియాతో మాట్లాడుతూ రిజిస్టార్ కార్యాలయాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రార్ పోడియం చూస్తే ప్రజలకు కోర్టులో ఉన్నామనే భావన కలగకుండా ఉండేందుకే ఇటువంటి మార్పులు తీసుకువస్తున్నామన్నారు. బ్రిటీష్ ప్రభుత్వ కాలం నుంచి కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాచరిక పోకడలు నేటికీ కొనసాగుతున్నాయన్నారు. క్రయ విక్రయదారులకు మంచి మర్యాద పూర్వకమైన సేవలను పొందగలుగుతున్నామనే భావన కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఈ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అత్యంత పారదర్శకతను పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ స్పెషల్ సిఎస్ ఆర్‌పి సిసోడియా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజి ఎంవి శేషగిరి బాబు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, గుణదల జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు కె.ప్రసాదరావు, ఎం.కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
