ప్రజాశక్తి-అమరావతి : ముంబై సినీనటి కాదంబరి జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరికి (ఎఫ్‌ఎస్‌ఎల్) పోలీసులు పంపే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలన్న వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ వినతిని హైకోర్టు తిరస్కరించింది. వాటిని భద్రంగా ఉంచాలని గతంలోనే తాము ఆదేశించామని గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాల్సివుందని చెప్పింది. విచారణను ఈనెల 16కు వాయిదా వేస్తూ జస్టిన్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
విద్యాసాగర్ రిమాండ్‌పై విచారణ 16కు వాయిదా
నటి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనను రిమాండ్ చేయడాన్ని విద్యాసాగర్ సవాల్ చేసిన పిటిషన్ విచారణ ఈ నెల 16కి వాయిదా పడింది. కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ విషయంలో విజయవాడ కోర్టును పట్టుబట్టరాదన్న గత ఉత్తర్వులను పొడిగించింది. ఈమేరకు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
పలువురి బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
నటి జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు సెప్టెంబర్ 13న నమోదు చేసిన కేసులో తమను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఇద్దరు ఐపిఎస్ అధికారులు, ఎసిపి, సిఐ, హైకోర్టు న్యాయవాది వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ గురువారానికి వాయిదా పడింది. మంగళవారం పిటిషనర్ల తరపు వాదనలు ముగిశాయి. ప్రాసెక్యూషన్, బాధిత మహిళ జత్వానీ వాదనలు గురువారం వింటామని జస్టిస్ విఆర్‌కె కృపాసాగర్ ప్రకటించారు. ఐపిఎస్ కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, సిఐ ఎం.సత్యనారాయణ, ఎసిపి కె.హనుమంతరావు, హైకోర్టు లాయర్ ఇనకొల్లు వెంకటేశ్వర్లు తరపున సీనియర్ న్యాయవాదులు ఎన్.శ్రీరామ్, ఓ.మనోహర్ రెడ్డి, వినోద్ కుమార్ దేశ్‌పాండే, న్యాయవాదులు కెఎల్‌ఎన్. స్వామి, దుష్యంత్‌రెడ్డి వాదించారు.
కుట్రపూరితంగా పిటిషనర్లను కేసులో ఇరికించారన్నారు. చట్ట ప్రకారమే జత్వానీపై ఫిర్యాదు విచారణ చేశారన్నారు. ఆ కేసు పెండింగ్‌లో ఉండగానే ఆమె పోలీసులపై ఇచ్చిన పిర్యాదు ఆధారంగా ఎదురు కేసు నమోదు చెల్లదన్నారు. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు, అడ్వకేట్ ఇనకొల్లు వెంకటేశ్వర్లు విషయంలో ఈ నెల 3వ తేదీ వరకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోరాదని పోలీసులను ఆదేశించింది.