ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న విద్యా, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రాజు, డి.పండు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యా, వసతి దీవెన నిధులు రూ. 3,480 కోట్లు పెండింగ్‌లో ఉంచిందని, చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా బకాయిలు ఉంచితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటిని విడుదల చేయాలని, కానీ టిడిపి కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందన్నారు. జిఒ నంబర్ 77 అమలుతో ప్రయివేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిపివేసిందన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యలో అవకాశాలు పెంచాలని డిమాండ్ చేశారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు. దీక్షల్లో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హెచ్. సింహాచలం కె. డేవిడ్ జి. సురేష్, రాజేష్ శ్రీను, అభిరామ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
