ప్రజాశక్తి – నూజివీడు టౌన్ : రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటిల్లోకి ఎంపికైన విద్యార్థుల జాబితాను ట్రిపుల్ ఐటి విసి కెసి.రెడ్డి గురువారం విడుదల చేశారు. నూజివీడులోని ట్రిపుల్ ఐటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటిలకు 93 శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి ఎంపికయ్యారని, మిగిలిన ఏడు శాతం ప్రయివేటు స్కూళ్ల నుంచి ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటిల్లో సీట్లు ఈసారి అత్యధికంగా 67.15 శాతం బాలికలు, 32.85 శాతం బాలురు సాధించారని వివరించారు. మన రాష్ట్రం విద్యార్థులు 98 శాతం సీట్లు సాధించగా, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుండి రెండు శాతం విద్యార్థులు సీట్లు సాధించారని చెప్పారు. ఈ నెల 22 నుండి 27వ తేదీ వరకు ట్రిపుల్ ఐటిల్లో కౌన్సెలింగ్‌లు సాగుతాయన్నారు. 22, 23 తేదీల్లో నూజివీడు క్యాంపస్, ఒంగోలు క్యాంపస్‌ల్లో, 24, 25 తేదీల్లో ఇడుపులపాయ ఆర్‌కె వ్యాలీ క్యాంపస్‌లో, 26, 27వ తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌లు జరుగుతాయని తెలిపారు. ఆగస్టు మొదటి వారం నుండి అన్ని ట్రిపుల్ ఐటిల్లో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇతర వివరాలు ఆర్‌జియుకెటి వెబ్‌సైట్‌లో ఉంటాయని వివరించారు.
